China: డీప్ సీక్ వెనక టెక్ పులి..

డీప్ సీక్.. డీప్ సీక్.. డీప్ సీక్.. ఎక్కడ విన్నా, ఎటు చూసినా ప్రస్తుతం ఈపదమే వినిపిస్తోంది, కనిపిస్తోంది కూడా. ప్రపంచ టెక్నాలజీ రంగాన్ని ఓ కుదుపు కుదిపేసింది కూడా.. ఇప్పుడు చాట్ జీపీటీ, జెమినీలను తోసిరాజని దూసుకెళ్తోంది.దీన్ని రూపొందించింది ఏ దిగ్గజ కంపెనీయో.. ఏ చేయి తిరిగిన నిపుణుల బృందమో కాదు.. ఓ అనామక కంపెనీ.. సాదారణ గ్రాడ్యుయేట్లతో దీన్ని తయారు చేసింది. ఈ బృందంలో కీలకంగా వ్యవహరించిన టెకీ లువో ఫులి(Luo fuli).
చూసేందుకు మోడల్ ను తలదన్నేలా ఉన్న లువో.. టెక్ సంచలనం డీప్‌సీక్ రూపకర్తల్లో ఈమె ఒకరు. సిచువాన్ ప్రావిన్స్‌లోని ఇబిన్ గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగారామె. బీజింగ్ నార్మల్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చదివారు. అయితే, ఆ సబ్జెక్టు… కొత్తల్లో ఆమెకి ఓ పట్టాన కొరుకుడు పడలేదట. అయినా పట్టు వదలక పూర్తి చేశారు. ఆపై పెకింగ్ విశ్వవిద్యాలయంలో కంప్యుటేషనల్ లింగ్విస్టిక్ ఇన్‌స్టిట్యూట్‌లో సీటు దక్కించుకున్నారు. 2019లో జరిగిన ప్రతిష్ఠాత్మక ACL కాన్ఫరెన్స్‌లో ఎనిమిది పరిశోధన పత్రాలు ప్రచురించి సంచలనం సృష్టించారు. దాంతో అలీబాబా డామో అకాడమీలో పరిశోధకురాలిగా చేరే అవకాశం కలిగింది.
అక్కడ మల్టీలింగ్వల్ ప్రీ ట్రైనింగ్ మోడల్ డెవలప్‌మెంట్‌తోపాటు ఓపెన్‌సోర్స్ అలైస్‌మైండ్ ప్రాజెక్టులోనూ కీలకంగా పనిచేశారు. 2022లో ఏఐ కంపెనీ ‘డీప్‌సీక్’లో చేరారు. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్(NLP)లో తనకు ఉన్న నైపుణ్యాలతో డీప్‌సీక్-వీ2 రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారు. లువో ప్రతిభను గుర్తించిన షావోమీ ఫౌండర్ లీ జున్ తమ సంస్థలో చేరమంటూ ఏడాదికి 10 మిలియన్ యువాన్లు ఆఫర్ చేశారు. ‘డీప్‌సీక్ విజయాన్ని అందరూ నాకు ఆపాదిస్తున్నా… ఇది సమష్టి విజయ’మని నిగర్వంగా చెబుతున్నారామె.