రుణ పరిమితి పెంపు చట్టంపై బైడెన్ సంతకం
అమెరికా రుణ పరిమితిని ఎత్తివేసే చట్టంపై ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేశారు. దేశ విదేశాల్లో ఆర్థిక మార్కెట్లను అశాంతికి గురిచేసిన నెల రోజుల నాటకానికి తెరదించారు. డెమోక్రటిక్, రిపబ్లికన్ నాయకుల పరస్పర భాగస్వామ్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ బైడెన్ ఓ సంక్షిప్త ప్రకటన విడుదల చేశారు. అమెరికాలో నగదు కొరత ఏర్పడుతుందని, అది అమెరికాతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను కుదిపేస్తుందని అంతకుముందు ట్రెజరీ డిపార్ట్మెంట్ హెచ్చరించింది. 2021 నాటికి అమెరికా ప్రభుత్వం తీసుకున్న అప్పు 28.5 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఇది అమెరికా జీడీపీ కంటే 24 శాతం ఎక్కువ. ఇందులో ఎక్కువ మొత్తం దేశీయంగా వ్యక్తులు, సంస్థల నుంచి సేకరించిందే. దాదాపు ఏడు లక్షల కోట్ల డాలర్లను విదేశాల నుంచి సేకరించింది. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వ అప్పుల పరిమితి 31.4 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది.






