India GDP: 2027 నాటికి 6.5% భారత్ జీడీపీ వృద్ధి: మూడీస్
భారత ఆర్థికవ్యవస్థ వృద్ధిపై (India Economy) ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ రేటింగ్స్ సానుకూలంగా స్పందించింది. దేశ స్థూల జాతీయోత్పత్తి (GDP) 2027 నాటికి దాదాపు 6.5 శాతం మేర వృద్ధిని సాధిస్తుందని అంచనా వేసింది (2026లో 6.4%, 2027లో 6.5%).
భారత్ వృద్ధి (India GDP) ప్రధానంగా దేశ మౌలిక సదుపాయాల్లో భారీ పెట్టుబడులు, ప్రజలు ఖర్చు చేసే ధోరణి పెరగడం, ఎక్కువ దేశాలకు ఎగుమతుల ద్వారా సమర్థవంతంగా కొనసాగనుందని మూడీస్ (Moody’s) తెలిపింది. అయితే ప్రైవేట్ కంపెనీలు ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండటం కొంత ప్రతికూలంగా మారవచ్చని అభిప్రాయపడింది.
భౌగోళిక రాజకీయ సవాళ్లు ఉన్నప్పటికీ దేశ ఆర్థికవ్యవస్థ (India Economy) పటిష్టంగా ఉందని మూడీస్ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు వేర్వేరు ద్రవ్య విధానాలను అనుసరిస్తున్నాయని తెలిపింది. చైనా, ఇండోనేషియా రేట్లను తగ్గిస్తుండగా, భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) మాత్రం తన పాలసీ విధానాన్ని స్థిరంగా కొనసాగిస్తోందని మూడీస్ వివరించింది.






