GDP: దుమ్ము రేపిన భారత్ వృద్ది, ట్రంప్ కు షాక్ తగిలిందా..?

ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులు, ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) 50% సుంకాలు విధించడం వంటి అంశాల్లో ఇబ్బంది పడుతోన్న భారత్.. వృద్దిలో మాత్రం మంచి ఫలితాలు సాధించింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన డేటా ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.8% వృద్ధి సాధించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన 6.5% వృద్ధి కంటే ఇది దాదాపు 1.3 శాతం ఎక్కువ. ముఖ్యంగా సర్వీస్ రంగంలో ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వచ్చింది.
ఏప్రిల్ నుండి జూన్ త్రైమాసికంలో మొత్తం స్థూల విలువ ఆధారిత 7.6% వృద్ధికి సేవా రంగమే కీలకంగా మారింది. జాతీయ గణాంకాల కార్యాలయం ప్రకారం.. ఈ ఆర్ధిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత జీడీపీ రూ.47.89 లక్షల కోట్లుగా అంచనా వేసినట్టు వెల్లడించారు. గత ఏడాది రూ.44.42 లక్షల కోట్లు మాత్రమే. ప్రస్తుత ధరల వద్ద నామమాత్రపు జీడీపీ రూ.86.05 లక్షల కోట్లుగా ఉంది. ఇది గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.79.08 లక్షల కోట్లుగా ఉంది. గత ఏడాది కంటే 8.8% ఎక్కువ.
ప్రొడక్షన్ ట్యాక్స్(Production Tax), సబ్సిడీలను మినహాయించి ఈ ఏడాది వృద్ది రూ.44.64 లక్షల కోట్లుగా ఉంది. గత ఏడాది రూ.41.47 లక్షల కోట్లుగా ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలు వాస్తవ లెక్కల్లో 3.7% వృద్ధి చెందాయి. గత ఏడాది ఇదే త్రైమాసికంలో కనిపించిన 1.5% వృద్ధి కంటే ఇది మెరుగ్గా ఉంది. సేవా రంగం ఈ ఏడాది క్వార్టర్ లో 9.3% వద్ద బలమైన వృద్ధిని నమోదు చేసింది. గత సంవత్సరం ఇదే కాలంలో నమోదైన 6.8% వృద్ధితో పోలిస్తే ఇది పెరుగుదలగా కేంద్రం పేర్కొంది.