Tariff Discussions: US టారిఫ్ సమస్య పరిష్కారంపై ఇండియా ఫోకస్..

ఏప్రిల్ 2 దగ్గర పడుతున్న కొద్దీ చాలా దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఎందుకంటే పెద్దన్న విధించిన పరస్పర సుంకాలు ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈనేపథ్యంలో భారత్- అమెరికాల మధ్య వాణిజ్యపరమైన ఒప్పందానికి సంబంధించిన చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ చర్చల్లో అమెరికా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చైనా, కెనడా, మెక్సికోలతో భారత్ (India)ను చూడబోమని యూఎస్ (USA) పేర్కొంది.
భారత్- యూఎస్ మధ్య వాణిజ్య ఒప్పందాలపై చర్చించేందుకు వాషింగ్టన్ వాణిజ్య అధికారి బ్రెండన్ లించ్ తన బృందంతో కలిసి భారత్‌కు వచ్చారు. ఈక్రమంలో ఢిల్లీ అధికారులతో ఆ బృందం చర్చలు ప్రారంభించింది. శుక్రవారం నాటికి ఇరుదేశాలు వాణిజ్యంపై ఒక ఒప్పందానికి రానున్నాయి. ‘ట్రంప్ పరిపాలనలో చైనా, మెక్సికో, కెనడా వంటి దేశాలతో భారత్‌ను కలిపి చూడటం లేదు. ఆయా దేశాలతో కరెన్సీ అవకతవకలు, అక్రమ వలసలు, ఇతర భద్రతా సమస్యలు ఉన్నాయి. కానీ, న్యూఢిల్లీతో టారిఫ్ సమస్య మాత్రమే ఉంది. వీటిని ఇరుదేశాలు సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోనున్నాయి. రెండు దేశాల ప్రభుత్వాలకు సంతృప్తికరమైన ఫలితం ఉంటుందని భావిస్తున్నాం’ అని చర్చల్లో పాల్గొన్న ఓ అధికారి తెలిపారు. ఇదిలాఉండగా.. ఈ వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఏప్రిల్‌లో వాషింగ్టన్‌లో పర్యటించనున్నట్లు మరో అధికారి తెలిపారు.
ఇప్పటికే కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) అగ్రరాజ్యంలో పర్యటించారు. ప్రతిపాదిత సుంకాలపై స్పష్టత కోరడం, వాటివల్ల దేశంపై పడే ప్రభావాన్ని అంచనా వేయడంపై ఫోకస్ పెట్టారు. సుంకాల తగ్గింపు, ద్వైపాక్షిక వాణిజ్యా,న్ని మెరుగుపరచడానికి రూపొందించిన వాణిజ్య ఒప్పందం వంటి వాటిపై యూఎస్ వాణిజ్య ప్రతినిధి జామిసన్ గ్రీర్‌తో పాటు వాణిజ్య కార్యదర్శి హూవార్డ్ లుట్నిక్‌తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ అమెరికాలో పర్యటించారు. ఇందులో భాగంగా ఇరు దేశాధినేతలు దౌత్య, వాణిజ్య, రక్షణ సంబంధాలపై చర్చలు జరిపారు. ఈనేపథ్యంలో ట్రంప్ మాట్లాడుతూ.. టారిఫ్‌ల విషయంలో ఎవరికీ మినహాయింపు లేదని ప్రధాని నరేంద్రమోడీతో స్వయంగా చెప్పినట్లు పేర్కొన్నారు. అమెరికా నుంచి చేసుకొనే దిగుమతులపై భారత్ అత్యధిక పన్నులు వేస్తోందని, ఇకపై తామూ అదేరీతిలో వ్యవహరిస్తామని తేల్చిచెప్పారు.