IMF: ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలక ఇంజిన్ గా భారత్.. ఐఎంఎఫ్ ప్రశంసలు…!

అగ్రరాజ్యం అమెరికా అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతోంది. చైనా (China) గ్రాఫ్ క్రమంగా పతనమవుతోంది. యూరోపియన్ దేశాల పరిస్థితి అడగకుంటేనే మంచిదన్నట్లుగా మారింది. రష్యా ఆర్థిక వృద్ధి.. యుద్ధంతో కుంచించుకుపోతోంది. మరి ఈ తరుణంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇంజిన్ లా మారుతోంది ఇండియా. అవును.. ఇండియా (India) ప్రపంచ ఆర్థికాభివృద్ధికి కీలక ఇంజిన్ లా మారిందని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్ ) ప్రశంసించింది. ప్రపంచవ్యాప్తంగా వృద్ధి రేటు నెమ్మదిస్తున్నప్పటికీ, భారత్ మాత్రం స్థిరంగా దూసుకెళుతోందని ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టలినా జార్జియేవా ప్రశంసించారు.
వచ్చే వారం వాషింగ్టన్‌లో ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ వార్షిక సమావేశాలు జరగనున్న నేపథ్యంలో జార్జియేవా ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. “ప్రపంచవ్యాప్తంగా వృద్ధి సరళిలో మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా చైనా వృద్ధి క్రమంగా మందగిస్తుండగా, భారత్ ఒక కీలక వృద్ధి చోదక శక్తిగా అభివృద్ధి చెందుతోంది” అని ఆమె వివరించారు. కరోనాకు ముందు ప్రపంచ వృద్ధి రేటు 3.7 శాతంగా ఉండగా, ప్రస్తుతం మధ్యకాలికంగా అది 3 శాతం వద్దే కొనసాగుతుందని అంచనా వేశారు.అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థలు అనేక ఒడిదొడుకులను తట్టుకుని నిలబడ్డాయని చెబుతూనే, ఇంకా పూర్తిస్థాయిలో పరీక్షలు ఎదురుకాలేదని, కాబట్టి ఇప్పుడే ఊపిరి పీల్చుకోవడం తొందరపాటు అవుతుందని ఆమె హెచ్చరించారు.
ఐఎంఎఫ్ మాత్రమే కాకుండా ఇతర ప్రముఖ ఆర్థిక సంస్థలు కూడా భారత్‌పై సానుకూల దృక్పథంతో ఉన్నాయి. ప్రపంచ బ్యాంకు, 2026 ఆర్థిక సంవత్సరానికి గాను భారత వృద్ధి అంచనాను 6.3 శాతం నుంచి 6.5 శాతానికి పెంచింది. ఇదే బాటలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) కూడా 2025-26 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాను 6.5 శాతం నుంచి 6.8 శాతానికి సవరించింది.
గత వారం ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ, జీఎస్టీ వంటి నిర్మాణాత్మక సంస్కరణలు, బలమైన ప్రైవేట్ వినియోగం, స్థిర పెట్టుబడుల కారణంగానే ఈ వృద్ధి సాధ్యమవుతోందని తెలిపారు. 2025-26 మొదటి త్రైమాసికంలో భారత జీడీపీ 7.8 శాతం మేర బలమైన వృద్ధిని నమోదు చేసిందని ఆయన గుర్తు చేశారు. మంచి వర్షపాతంతో గ్రామీణ డిమాండ్ బలంగా ఉండగా, పట్టణ ప్రాంతాల్లో కూడా డిమాండ్ క్రమంగా పుంజుకుంటోందని ఆయన పేర్కొన్నారు.