Andhra: బడ్జెట్ లో ఏపీకి భారీగానే కేటాయింపులు…

కేంద్ర బడ్జెట్ 2025-26లో ఆంధ్రప్రదేశ్ కూ భారీగానే కేటాయింపులు దక్కాయి. రాష్ట్రానికి చెందిన పలు కీలక ప్రాజెక్టులకు ఆర్థికమంత్రి తన బడ్జెట్ లో కేటాయింపులు చేశారు. అయితే బడ్జెట్ ప్రసంగంలో మాత్రం వీటిపై ప్రకటనలు చేయలేదు. ఇవన్నీ ఇప్పటికే కొనసాగుతున్న ప్రాజెక్టులు కావడంతో వీటికి ఇచ్చిన కేటాయుంపుల్ని ఆ తర్వాత ఆర్ధిక శాఖ నోట్ రూపంలో విడుదల చేసింది.
ఏపీకి జీవనాడి లాంటి పోలవరం(polavaram) ప్రాజెక్టుతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్(steel plant), విశాఖపట్నం పోర్టు(port), మరికొన్ని పెండింగ్ పనులకు ఈసారి బడ్జెట్ లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నిధుల కేటాయింపు చేసారు. ఇందులో ఒక్క పోలవరం ప్రాజెక్టుకే 18 వేల కోట్ల వరకూ దక్కాయి. వీటిలో పోలవరం ప్రాజెక్టుకు రూ.5936 కోట్లు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి బ్యాలెన్స్ గ్రాంట్ రూపంలో మరో రూ.12157 కోట్లు ఇవ్వనున్నారు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ.3295 కోట్లు, విశాఖపట్నం పోర్టుకు రూ.730 కోట్లు కేటాయించారు.
మరోవైపు రాష్ట్రంలోని ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి రూ.162 కోట్లు, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ కు రూ.186 కోట్లు, లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆపరేషన్ కు రూ.375 కోట్లు, రాష్ట్రంలో రోడ్లు, వంతెనల నిర్మాణానికి మరో రూ.240 కోట్ల నిధులు బడ్జెట్ లో కేటాయించారు. అలాగే ఏపీ ఇరిగేషన్, లైవ్లీ హుడ్ ఇంప్రూవ్ మెంట్ ప్రాజెక్టు రెండో దశకు రూ.242.50 కోట్ల సాయం అందించాలని కేంద్రం బడ్జెట్ లో నిర్ణయించింది. ఇలా పలు రూపాల్లో ఏపీకి దాదాపు రూ.23 వేల కోట్ల నిధులు అందించేందుకు కేంద్రం బడ్జెట్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.