Forbes100: భారత కుబేరుడు అంబానీ.. ఫోర్బ్స్ 100 రిచెస్ట్ పీపుల్ ఇండియా..!

దేశంలోనే అత్యంత ధనికుల లిస్టులో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ (Mukesh Ambani) అగ్రస్థానంలో నిలిచారు. ధనవంతుల సంపద ఈ ఏడాది గణనీయంగా తగ్గినప్పటికీ.. అంబానీ మాత్రం లిస్టులో తొలిస్థానాన్ని పదిలపరుచుకున్నారు. అంతర్జాతీయ మ్యాగజైన్ ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసిన ‘భారత 100 మంది అత్యంత ధనవంతుల జాబితా-2025’ ఈ వివరాలను వెల్లడించింది.
ఫోర్బ్స్ నివేదిక ప్రకారం ముఖేశ్ అంబానీ 105 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 9.32 లక్షల కోట్లు) నికర సంపదతో అగ్రస్థానంలో నిలిచారు. గత ఏడాదితో పోలిస్తే ఆయన ఆస్తి 12 శాతం మేర తగ్గినప్పటికీ, దేశంలో 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లో ఉన్న ఏకైక వ్యక్తి ఆయనే కావడం విశేషం. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ 92 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 8.17 లక్షల కోట్లు) సంపదతో రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. ఓపీ జిందాల్ గ్రూప్ చైర్మన్ సావిత్రి జిందాల్ కుటుంబం 40.2 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో నిలవగా, టాప్-10లో ఉన్న ఏకైక మహిళగా ఆమె నిలిచారు.
కుబేరుల సంపదకు గండి
ఈ ఏడాది దేశంలోని 100 మంది కుబేరుల మొత్తం సంపద 9 శాతం మేర తగ్గి ట్రిలియన్ డాలర్లకు (సుమారు రూ. 88.8 లక్షల కోట్లు) పరిమితమైందని ఫోర్బ్స్ నివేదిక పేర్కొంది. రూపాయి విలువ పతనం, స్టాక్ మార్కెట్లలోని బలహీనతలు ఇందుకు ప్రధాన కారణాలని విశ్లేషించింది. జాబితాలోని మూడింట రెండొంతుల మంది సంపన్నుల ఆస్తులు ఈ ఏడాది తగ్గుముఖం పట్టాయని తెలిపింది. అయితే ఈ ప్రతికూల పరిస్థితుల్లోనూ భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ ఆస్తి 3.5 బిలియన్ డాలర్లు పెరిగింది. దీంతో ఆయన మూడు స్థానాలు ఎగబాకి నాలుగో ర్యాంకుకు చేరుకున్నారు. హెచ్‌సీఎల్ టెక్ వ్యవస్థాపకులు శివ్ నాడార్ ఐదో స్థానంలో నిలిచారు.
జాబితాలో ఆరుగురు తెలుగువారు
ఈ ప్రతిష్ఠాత్మక జాబితాలో ఆరుగురు తెలుగు పారిశ్రామికవేత్తలు స్థానం సంపాదించడం గమనార్హం. వీరిలో దివీస్ ల్యాబొరేటరీస్ అధిపతి మురళి దివి, రూ. 88,800 కోట్ల సంపదతో జాతీయ స్థాయిలో 25వ ర్యాంకులో నిలిచి, తెలుగువారిలో అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. ఆయనతో పాటు మేఘా ఇంజనీరింగ్ అధినేతలు పీపీ రెడ్డి, పీవీ కృష్ణా రెడ్డి (70వ ర్యాంకు), జీఎంఆర్ గ్రూప్ అధినేత గ్రంథి మల్లికార్జున రావు (83వ ర్యాంకు), అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకులు ప్రతాప్ సి.రెడ్డి (86వ ర్యాంకు), హెటిరో గ్రూప్ చైర్మన్ బి.పార్థసారధి రెడ్డి (89వ ర్యాంకు), డాక్టర్ రెడ్డీస్ కుటుంబానికి చెందిన కె. సతీశ్ రెడ్డి (91వ ర్యాంకు) ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.