Budget 2025: బడ్జెట్లో ఆదాయపు పన్నులో మినహాయింపులు ఖాయమా..?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (finance minister nirmala sitharaman) ఫిబ్రవరి 1న అంటే శనివారం వార్షిక బడ్జెట్ (budget 2025) ను పార్లమెంటులో (parliament) ప్రవేశపెట్టబోతున్నారు. శుక్రవారమే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు రాష్ట్రపతి (president speech) ప్రసంగం ఉంటుంది. అనంతరం శనివారం బడ్జెట్ ప్రవేశ పెడతారు. కేంద్రంలో బీజేపీ (BJP) అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏటా ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశ పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టబోయే బడ్జెట్ పై సగటు జీవులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కచ్చితంగా ఈసారి ఆదాయపు పన్నుల్లో (income tax) మినహాయింపులు ఉంటాయని ఆశిస్తున్నారు.
నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టే ప్రతిసారి వేతన జీవులు పన్నుల్లో మినహాయింపు (tax rebates) కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ప్రతిసారీ ఆవిడ ఊరించి ఉసూరుమనిపిస్తున్నారు. చిన్నాచితకా మార్పులు చేసినా అవి వేతన జీవులకు (employees) పెద్దగా ఉపయోగపడేలా లేవు. అయితే ఈసారి మాత్రం కచ్చితంగా మేలు చేసేలా నిర్ణయాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా కొత్త పన్ను చెల్లింపు విధానం ద్వారా ట్యాక్స్ పేయర్స్ (tax payers) కు ఉపశమనం కల్పిస్తారనుకుంటున్నారు.
ప్రస్తుతం 7 లక్షల వరకూ పన్ను మినహాయింపు లభిస్తోంది. దీన్ని రూ.10లక్షలకు పెంచే అవకాశం ఉందని మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇదే జరిగితే మధ్యతరగతికి ఎంతో మేలు జరుగుతుంది. ప్రస్తుతం పన్నుల్లో 6 శ్లాబులు అమల్లో ఉన్నాయి. వీటిని 3కు కుదింతే అవకాశం ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం గరిష్ట పన్నురేటు 30శాతం ఉండగా.. దాన్ని 25కు కుదించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. 10 – 15 లక్షల మధ్య 10లేదా 15 శాతం, 15లక్షలకు పైనున్న వారిపైన 25శాతం పన్ను విధించే అవకాశం ఉంది. తద్వారా 10లక్షల లోపు మినహాయింపులను అత్యధిక వేతన జీవుల నుంచి రాబట్టుకునే ఛాన్స్ కలుగుతుంది.
పన్ను వసూళ్లపై దేశవ్యాప్తంగా తీవ్ర అసంతృప్తి ఉంది. మిగిలిన దేశాలతో పోల్చితే పన్నులు అధికంగా ఉన్నాయని ప్రజలు భావిస్తున్నారు. అసంతృప్తి ఆగ్రహంగా మారకముందే పన్నుల్లో మినహాయింపులు ఇవ్వడం ద్వారా ప్రజలకు కాస్త ఉపశమనం కల్పించాలని మోదీ ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. మూడుసార్లు అధికారం ఇచ్చినందుకు కృతజ్ఞతగా ప్రజలకు మేలుచేసేలా బడ్జెట్ ఉండాలని ఆర్థికమంత్రికి సూచించినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఊహాగానాలు నిజమైతే ఈసారి బడ్జెట్లో కచ్చితంగా వేతన జీవులకు కాస్త లబ్ది చేకూరే అవకాశం ఉంది. అయితే ప్రతి ఏటా బడ్జెట్ ప్రవేశ పెట్టే ముందు ఇలాంటి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ బడ్జెట్లో మాత్రం అలాంటివేవీ ఉండట్లేదు. మరి ఈసారైనా నిర్మలమ్మ కరుణుస్తుందో లేదో చూడాలి.