Delhi: నేటి నుంచి భారత్ పై ట్రంప్ ట్యాక్సుల భారం..

రష్యా (Russia) నుంచి ముడి చమురు కొంటున్న భారత్ (India) పై ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా విధించిన అదనపు సుంకాలు .. నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. గతంలో విధించిన 25శాతానికి అదనంగా మరో 25శాతం కలిపి భారత్ ఎగుమతులపై 50శాతం భారం పడనుంది. మన దేశం నుంచి ఎగుమతయ్యే 48 బిలియన్ డాలర్ల వాణిజ్యంపై ఇది ప్రభావం చూపనుంది. సుంకాల అమలుపై అమెరికా హోంలాండ్ భద్రతా విభాగం సోమవారం ముసాయిదా ఉత్తర్వులు జారీ చేసింది.
బుధవారం తెల్లవారుజామున 12.01 గంటల్లోగా ఓడల్లో లోడ్ చేసిన ఉత్పత్తులకు, రవాణాలో ఉన్న వాటికి అదనపు సుంకాలు వర్తించవు. వాటిని సెప్టెంబరు 17వ తేదీ తెల్లవారుజామున 12.01 గంటల్లోగా వినియోగిస్తున్నట్లుగా, గోదాముల నుంచి బయటకు వచ్చినట్లుగా పరిగణిస్తారు. వీటికి ప్రత్యేక కోడ్‌ను కేటాయిస్తారు.
భారత్, బ్రెజిల్‌లపైనే అమెరికా అత్యధికంగా 50శాతం సుంకాలను అమలు చేస్తోంది. వాణిజ్యశాఖ లెక్కల ప్రకారం.. అమెరికా అదనపు సుంకాలవల్ల 48.2 బిలియన్ డాలర్ల వాణిజ్యంపై ప్రభావం పడనుంది. మన దేశంపై అదనపు భారంవల్ల అమెరికాకు ఎగుమతుల్లో మనతో పోటీపడే దేశాలకు ప్రయోజనం కలగనుంది.
రొయ్యల పరిశ్రమకు కష్టకాలం
2021-22 నుంచి భారత్‌కు అమెరికా అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. 2024-25లో రెండు దేశాల మధ్య 131.8 బిలియన్ డాలర్ల వ్యాపారం జరిగింది. ఇందులో 86.5 బిలియన్ డాలర్ల ఎగుమతులు, 45.3 బిలియన్ డాలర్ల దిగుమతులున్నాయి.
50శాతం సుంకాలవల్ల జౌళి, జెమ్స్, ఆభరణాలు, రొయ్యల పరిశ్రమలపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈ రంగాల్లోని కార్మికుల ఉపాధి దెబ్బతిననుంది. అమెరికాకు జరిగే ఎగుమతుల్లో 66శాతం (60.2 బిలియన్ డాలర్లు) కీలక కార్మిక రంగాలైన దుస్తులు, జెమ్స్, ఆభరణాలు, రొయ్యలు, కార్పెట్లు, ఫర్నిచర్‌లలోనే ఉన్నాయి. 3.8శాతం ఆటోమొబైల్ ఎగుమతులపై 25శాతం సుంకం పడనుంది. (వాణిజ్య విలువ 3.4 బిలియన్ డాలర్లు).
30.2% శాతం ఎగుమతులపై ప్రస్తుతానికి ఎటువంటి సుంకాలు లేవు. భారత్ నుంచి 2.4 బిలియన్ డాలర్ల విలువైన రొయ్యలు అమెరికాకు ఎగుమతి అవుతాయి. దీనివల్ల విశాఖపట్నం కేంద్రంగా జరిగే వ్యాపారం దెబ్బతిననుంది.వజ్రాలు, ఆభరణాల ఎగుమతులు 10 బిలియన్ డాలర్లు. దీనివల్ల సూరత్, ముంబయిల్లోని పరిశ్రమలపై ఒత్తిడి పడనుంది. జౌళి, దుస్తుల ఎగుమతుల విలువ 10.8 బిలియన్ డాలర్లు. ఇవి ప్రధానంగా కేంద్రీకృతమైన తమిళనాడులోని తిరుపూర్, ఢిల్లీ (ఎన్‌సీఆర్), బెంగళూరులలో ఉపాధి దెబ్బతిననుంది.