ఢిల్లీ – శాన్ఫ్రాన్సిస్కో విమానంలో సమస్య!
ఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోకు బయలుదేరిన ఓ ఎయిరిండియా విమానం ఇంజిన్లో సమస్య తలెత్తింది. దీంతో విమానాన్ని అత్యవసరంగా రష్యాకు మళ్లించారు. చివరకు అక్కడ సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయాన్ని ఎయిరిండియా అధికారులు వెల్లడించారు. ఢిల్లీ నుంచి శాన్ఫ్రాన్సిస్కోకు బయలుదేరిన ఎయిరిండియా విమానం ఎఐ173 ఓ ఇంజిన్లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు పైలట్లు గుర్తించారు. దీంతో వెంటనే విమానాన్ని రష్యా వైపు మళ్లించాలని నిర్ణయించారు. అనంతరం అది రష్యాలోని మాగదన్ విమానాశ్రయంలో సురక్షితంగా దిగింది. ఆ సమయంలో విమానంలో 216 మంది ప్రయాణికులతో పాటు 16 మంది సిబ్బంది ఉన్నట్లు ఎయిరిండియా వెల్లడిరచింది. అక్కడ దిగిన వెంటనే ప్రయాణికులకు అవసరమైన వసతి కల్పించడంతో పాటు వారి గమ్యస్థానాలకు పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపింది. విమానానికి తప్పనిసరి పరీక్షలన్నీ చేస్తున్నామని ఎయిరిండియా అధికార ప్రతినిధి వెల్లడించారు.






