LPG Cylinder: వంట గ్యాస్ ధరలు పెంచిన కేంద్రం.. ఒక్కో సిలిండర్‌పై రూ.50 అదనం

కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలను (LPG Cylinder) సవరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ. 50 మేర ధరను పెంచుతున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి అధికారికంగా ప్రకటించారు. ఈ పెంచిన ధరలు మంగళవారం నుంచే దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తాయని ఆయన తెలిపారు. ఈ తాజా పెంపు ప్రభావం సాధారణ వంట గ్యాస్ వినియోగదారులతో పాటు, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద రాయితీపై సిలిండర్ (LPG Cylinder) పొందుతున్న లబ్ధిదారులపై కూడా పడనుంది. దీంతో సాధారణ వినియోగదారులు వాడే 14.2 కిలోల సిలిండర్ ధర ప్రస్తుతం ఉన్న రూ. 803 నుంచి రూ. 853కు చేరుకోనుంది. అదేవిధంగా ఉజ్వల పథకం ద్వారా రూ. 503కు ఈ సిలిండర్ పొందుతున్న లబ్దిదారులు ఇకపై రూ. 553 చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం ఇప్పటికే పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో సతమతమవుతున్న సామాన్య ప్రజలపై, ముఖ్యంగా పేద, మధ్య తరగతి కుటుంబాలపై అదనపు ఆర్థిక భారాన్ని మోపనుంది. మరోవైపు, పెట్రోల్, డీజిల్‌పై కూడా లీటర్‌కు రూ. 2 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని పెంచినట్లు కూడా మంత్రి తెలిపారు. అయితే, ఈ అదనపు భారాన్ని ప్రస్తుతానికి చమురు మార్కెటింగ్ కంపెనీలే భరిస్తాయని, వినియోగదారులపై తక్షణ ప్రభావం ఉండబోదని ఆయన స్పష్టం చేశారు.