Delhi: ట్రంప్ ట్రేడ్ వార్ పై కలిసి పోరాడుదాం.. భారత్ కు చైనా అభ్యర్థన..

ఇన్నాళ్లు ఒక ఎత్తు.. ఇప్పుడు ఒక ఎత్తు.. ట్రంప్ వచ్చాడిక్కడ.. ఇది అమెరికా సర్కార్ వ్యవహరిస్తున్న తీరు. ప్రపంచదేశాలన్నింటిపైనా ట్రంప్ ట్రేడ్ వార్ ప్రకటించారు. దీంతో ప్రపంచమంతా వాణిజ్య యుద్ధ భయాలు కమ్ముకున్నాయి. ముఖ్యంగా చైనాపై 104 శాతం టారిఫ్‌లు ప్రకటించడం ఈ ఆర్థిక అనిశ్చితుల వేళ మరింత ఆందోళనకరంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో చైనా అధికారిణి ఒకరు కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా సుంకాల (Trump Tariffs) సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్, చైనా (India-China) జత కట్టాలని న్యూఢిల్లీలోని బీజింగ్ ఎంబసీ అధికార ప్రతినిధి యూ జింగ్ అన్నారు. ఈ మేరకు ఆమె చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.
ట్రంప్ (Donald Trump) సుంకాల నేపథ్యంలో భారత్-చైనా ఆర్థిక సంబంధాల గురించి ఆమె ప్రస్తావించారు. ‘‘పరస్పర సహకారం, ప్రయోజనాలపై ఇరు దేశాల ఆర్థిక, వాణిజ్య సంబంధాలు ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుతం అమెరికా సుంకాల వేధింపుల కారణంగా అనేక దేశాలు, ముఖ్యంగా పేద దేశాలు.. అభివృద్ధి చెందే హక్కును కోల్పోతున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేందుకు మన రెండు దేశాలు కలిసి నిలబడాలి. వాణిజ్య, సుంకాల యుద్ధాల్లో విజేతలు ఎవరూ ఉండరు. విస్తృతమైన సంప్రదింపుల తర్వాత రూపొందించిన అంతర్జాతీయ విధానాలను అన్ని దేశాలు గౌరవించాలి. ఇలా ఏకపక్షవాదం, రక్షణవాదంతో తీసుకునే నిర్ణయాలను సమష్టిగా వ్యతిరేకించాలి’’ అని చైనా (China) అధికారిణి పిలుపునిచ్చారు.
ఇటీవల భారత్, చైనా సహా అనేక దేశాలపై ట్రంప్ సుంకాలు ప్రకటించారు. భారత్‌పై 26శాతం, చైనాపై అదనంగా 34శాతం టారిఫ్‌లు వసూలు చేయనున్నట్లు తెలిపారు. అయితే అంతకుముందే బీజింగ్‌పై అగ్రరాజ్యం 20శాతం సుంకాలు అమలుచేస్తుండటంతో అప్పటికి మొత్తం సుంకాల విలువ 54శాతానికి చేరింది.
అయితే, ట్రంప్ నిర్ణయానికి ప్రతిగా చైనా కూడా అమెరికా నుంచి దిగుమతయ్యే వస్తువులపై 34శాతం అదనపు సుంకం విధించాలని నిర్ణయించింది. దీంతో భగ్గుమన్న ట్రంప్.. టారిఫ్ ప్రకటనను వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు. డ్రాగన్ వెనక్కి తగ్గకపోవడంతో అదనంగా మరో 50శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా నిర్ణయంతో బీజింగ్‌పై మొత్తం సుంకాలు 104 శాతానికి చేరుకున్నాయి.