China: ట్రంప్ దెబ్బకు చైనా విలవిల.. పోరాటంలో కలిసి రావాలని భారత్, ఈయూలకు వినతి

కాలం కలిసి రాకుంటే అనే పదానికి అర్థం ఏమిటో చైనా(China) కు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. నిన్నటి వరకూ మేం చైనీయులం.. ఎవరికీ భయపడం .. కలిసి కూర్చుని చర్చిద్దాం అని మేకపోతు గాంభీర్యం ఒలకబోసిన చైనా.. ఇప్పుడు ఈ పరిస్థితి నుంచి గట్టెక్కడమెలా అని ఆందోళన చెందుతోంది. దీనిలో భాగంగా మొన్నటివరకూ భారత్ లో చొరబాటుకు ప్రయత్నించిన డ్రాగన్ కంట్రీ.. ఇప్పుడేమో అమెరికాతో ట్రేడ్ వార్ లో కలిసి రావాలని భారత్ కు విజ్ఞప్తి చేసింది.
ఇక ట్రంప్ అస్సలు తగ్గకపోవడం.. టారిఫ్ లను ఏకబిగిన పెంచేస్తూ పోతుండడంతో.. చైనా ఉక్కిరిబిక్కిరవుతోంది. దీంతో పొరుగు దేశాలతో జట్టు కట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఆ దేశాధినేత జిన్‌పింగ్ (Xi Jinping) ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించుకునేందుకు పర్యటనలు జరపాలని నిర్ణయించుకున్నారు. ఏప్రిల్ 14 నుంచి 18 వరకు వియత్నాం, మలేసియా, కంబోడియా దేశాల్లో పర్యటించాలని నిర్ణయించినట్లు చైనా విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ మూడు దేశాలకు ఆసియాన్ గ్రూప్‌లో సభ్యత్వం ఉంది. ఈ గ్రూప్‌నకు చైనాకు మధ్య ఏటా 962 బిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతుంది. దీనిలో 575 బిలియన్ డాలర్లు చైనా ఎగుమతులే ఉంటున్నాయి.
మరోవైపు.. తమతో పోరాటంలో కలిసి రావాలంటూ యూరోపియన్ యూనియన్ దేశాలను కోరారు జిన్ పింగ్. అప్పుడే హక్కులు, వాణిజ్యం సహా చాలా అంశాల్లో న్యాయం జరుగుతుందన్నారు. లేకుంటే.. చాలా కష్టపడాల్సి వస్తుందని ఈయూకు సూచించారు చైనా అధినాయకులు. ఇప్పటికే చాలా యూరోపియన్ దేశాలు.. అమెరికా తీరుపై ఆగ్రహంగా ఉన్నాయి. అయితే కొన్ని దేశాలు మాత్రం.. ట్రంప్ సర్కార్ తో చర్చలు జరుపుతూ.. టారిఫ్ లను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి కూాడ.
వాస్తవానికి ట్రంప్ టారిఫ్‌లు ప్రకటించిన తర్వాత చాలా దేశాలు ఆచితూచి స్పందించాయి. కానీ, చైనా మాత్రం వాషింగ్టన్‌పై ఏకంగా 84 శాతం పన్నులు విధించింది. దీంతో అమెరికా టారిఫ్‌లను మొత్తం కలిపి బీజింగ్‌పై 145 శాతానికి పెంచింది. ప్రతిఘటించని దేశాలకు 90 రోజుల సమయం ఇస్తూ ట్రంప్ చకచక నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో అమెరికాలో ఇతర దేశాల వస్తువులతో పోలిస్తే.. చైనా దిగుమతి వస్తువుల రేట్లు చాలా ఎక్కువగా ఉండనున్నాయి.
సుంకాలపై అమెరికాతో తీవ్రంగా తలపడుతున్న చైనా కాస్త వెనక్కి తగ్గింది. బెదిరింపులకు తలొగ్గబోమంటూనే చర్చలకు సిద్ధమని ప్రకటించింది. అమెరికా విధించిన 145 శాతం సుంకాలకు నిరసనగా ఫిల్మ్‌ల దిగుమతులను తగ్గించింది. అమెరికా సుంకాల యుద్ధమే చేయాలనుకుంటే.. తుదివరకూ తాము పోరాడతామని చైనా వాణిజ్యశాఖ అధికార ప్రతినిధి యాంగ్‌కియాన్ పేర్కొన్నారు. ‘చైనాతో డీల్ చేయాలంటే.. ఒత్తిళ్లు, బెదిరింపులు, బ్లాక్‌మెయిళ్లు సరైన మార్గం కాదన్నారు.