Pakistan: దోస్త్ మేరా దోస్త్.. పాక్ కు చైనా జలాంతర్గాములు ..

పాక్ పంథా మార్చింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత తన బలాబలాలపై పాక్ కు అవగాహన వచ్చినట్లు కనిపిస్తోంది. దీంతో కలసి వచ్చే అన్ని దేశాల నుంచి వివిధ రకాల ఆయుధాలను కొనుగోలు చేస్తూ వస్తోంది. ఓవైపు అమెరికాతో పలు ఒప్పందాలు చేసుకుంటున్న పాక్ పాలకులు.. మరోవైపు పాత మిత్రుడు చైనా (China) తో బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటున్నారు. దీనిలో భాగంగా తన ఆధునిక హాంగోర్ తరగతి జలాంతర్గామిని చైనా శనివారం పాక్ కు అందించింది.
పాక్‌కు మొత్తం ఎనిమిది జలాంతర్గాములను అందించనున్న చైనా ఈ ఏడాది మార్చిలో రెండవ, తాజాగా మూడవ జలాంతర్గామిని అందజేసింది. ఇటీవలి సంవత్సరాలలో చైనా నాలుగు ఫ్రిగేట్ యుద్ధ నౌకలను కూడా పాక్‌కు సరఫరా చేసింది. వీటితో పాటు పాక్ ఏకైక గూఢచారి నౌక రిజ్వాన్‌ను కూడా అందజేసింది. అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రాలలో పాకిస్థాన్ నౌకాదళాన్ని బలోపేతం చేయడమే చైనా లక్ష్యం.
పాక్ దగ్గరున్న ఆయుధాలలో 81 శాతం చైనా సరఫరా చేసినవే. 600 వీటీ4 తరగతి యుద్ధ టాంకులు, 36 జే 10సీఈ యుద్ధ విమానాలను కూడా చైనా అందించింది. తన జెఎఫ్ 17 ఫైటర్ విమానాలను పాకిస్థాన్‌లో సంయుక్తంగా తయారుచేస్తోంది.