USA: అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం..

రెండు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాల మధ్య ట్రేడ్ వార్ మళ్లీ మొదలైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(trump) ట్యాక్సుల ప్రకటనపై చైనా ఎదురుదాడికి దిగింది. అసలే డ్రాగన్ దూకుడుగా ఉంటుంది. మరి చైనా పన్నులేస్తే ఊరుకుంటుందా.. అమెరికాపై చైనా ప్రతీకార టారిఫ్స్ తో దాడి చేసింది. డొనాల్డ్ ట్రంప్ చైనాతో వాణిజ్య యుద్ధం ప్రారంభించిన కొన్ని రోజుల అనంతరం ప్రతి చర్యగా అనేక రకాల అమెరికన్ వస్తువులపై చైనా ప్రతిగా 10 నుంచి 15 శాతం సుంకాలను విధించింది. చైనా చర్య ప్రపంచ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.
అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న బొగ్గు, ఎల్‌ఎన్‌జీ ఉత్పత్తులపై 15 శాతం , క్రూడాయిల్, వ్యవసాయ యంత్రాలు , పెద్ద కార్లు, పికప్ ట్రక్స్, ఇతర ఉత్పత్తులపై 10 శాతం సుంకాలు విధించనున్నట్లు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.అమెరికా ఏకపక్షంగా సుంకాలను పెంచడం ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించడమేనని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఇది అమెరికా సమస్యలను పరిష్కరించడంలో సహాయపడకపోవడమే కాకుండా.. చైనా, అమెరికాల మధ్య సాధారణ ఆర్థిక, వాణిజ్య సహకారాన్నికూడా దెబ్బతీస్తుందని ప్రకటనలో తెలిపింది.
అమెరికా టెక్ దిగ్గజం గూగుల్(Google) పై యాంటీ-ట్రస్ట్ ఉల్లంఘన ఆరోపణలపై దర్యాప్తు చేస్తామని చైనా ప్రకటించింది. ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కెనడా, మెక్సికో, చైనాలపై సుంకాలు విధించే ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుపై సంతకం చేసిన సంగతి తెలిసిందే. ఈ సుంకాలు ఫిబ్రవరి 1 నుండి అమల్లోకి వచ్చాయి. కానీ నిరసనల తర్వాత మెక్సికో, కెనడాపై విధించిన సుంకాల వ్యవధిని ఒక నెల పాటు పొడిగించారు. కానీ చైనాపై సుంకాన్ని అలాగే ఉంచారు. ట్రంప్ ప్రభుత్వం సుంకాలు విధించాలనే నిర్ణయంపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సుంకాన్ని వ్యతిరేకిస్తున్నామని చైనా ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రపంచ వాణిజ్య సంస్థలో అమెరికాపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. అమెరికా తప్పుడు పద్ధతిని ఉపయోగిస్తోందని.. మా ప్రయోజనాలు కాపాడుకునేందుకు కట్టుబడి ఉన్నామని చైనా ప్రకటన విడుదల చేసింది.
అయితే ట్రేడ్ వార్ కారణంగా చైనా కరెన్సీ యువాన్ విలువ పడిపోయింది. ఫలితంగా ఆస్ట్రేలియా డాలర్, న్యూజిలాండ్ డాలర్ విలువ పతనమయ్యాయి.