GST: జీఎస్టీ స్లాబుల్లో మార్పులు.. 12% శ్లాబు రద్దుకు కసరత్తు?

మధ్యతరగతి, నిరుపేద ప్రజలకు ఆర్థిక భారాన్ని తగ్గించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. త్వరలో జరగనున్న జీఎస్టీ (GST) కౌన్సిల్ సమావేశంలో రోజువారీ వినియోగ వస్తువులపై 12 శాతం జీఎస్టీని 5 శాతానికి తగ్గించడం లేదా 12 శాతం జీఎస్టీ శ్లాబును పూర్తిగా తొలగించడం వంటి అంశాలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 12 శాతం జీఎస్టీ పరిధిలో ఉన్న వస్తువులన్నీ సామాన్య ప్రజలు నిత్యం వాడేవే కావడంతో వాటిని 5 శాతం ట్యాక్స్ బ్రాకెట్‌లోకి చేర్చడం ద్వారా ప్రజలకు ఊరట కల్పించాలని (GST) కౌన్సిల్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ 12 శాతం శ్లాబును పూర్తిగా తొలగిస్తే, ఆ వస్తువులను మిగిలిన శ్లాబుల్లో సర్దుబాటు చేసే ప్రణాళిక కూడా ఉందట. ఈ నెల చివరిలో 56వ జీఎస్టీ (GST) కౌన్సిల్ సమావేశం నిర్వహించే అవకాశాలున్నాయి. సమావేశం జరగడానికి 15 రోజుల ముందుగా నోటీసు ఇవ్వాల్సి ఉన్నందున, ఈ నెలాఖరులో ఇది జరిగే సూచనలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. పలు రాష్ట్రాల్లో ఈ ఏడాది, వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈసారి జీఎస్టీ (GST) కౌన్సిల్ సమావేశం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నిర్ణయాలు సామాన్యులకు ఎంతవరకు మేలు చేస్తాయో వేచి చూడాలి.