ASBL NSL Infratech

బీజేపీ ఆఫర్‌పై ఆధారాలు సమర్పిచండి : ఢిల్లీ మంత్రి అతిశీకి ఈసీ నోటీసులు

బీజేపీ ఆఫర్‌పై ఆధారాలు సమర్పిచండి : ఢిల్లీ మంత్రి అతిశీకి ఈసీ నోటీసులు

ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మంత్రి ఆతిశీ మర్లీనాకు శుక్రవారం ఎన్నికల కమిషన్(ఈసీ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. బీజేపీలో చేరాలంటూ తనపై ఒత్తిడి తెస్తున్నారంటూ ఇటీవల ఆమె చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ నోటీసులు జారీ చేసినట్లు ఈసీ వెల్లడించింది. అంతేకాకుండా ఈ వ్యవహారంలో ఈ నెల 6వ తేదీ అంటే సోమవారంలోగా సమాధానం ఇవ్వాలని, అందుకు సంబంధించిన సరైన ఆధారాలు తమకు సమర్పించాలని సూచించింది. కేజ్రీవాల్ అరెస్టయిన నేపథ్యంలో ఢిల్లీ మంత్రి అతిశీ వరుస మీడియా సమావేశాలు నిర్వహిస్తూ బీజేపీ సర్కార్‌పై నిప్పులు చెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ నెల 3వ తేదీ నిర్వహించిన మీడియా సమావేశంలో తమ పార్టీలో చేరాలంటూ బీజేపీ తనకు ఆఫర్ ఇచ్చిందని, అది కూడా తనకు అత్యంత సన్నిహితుల ద్వారా తనను సంప్రదించిందని అతిశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అతిశీ వ్యాఖ్యలపై బీజేపీ నేతలంతా ఒక్కసారిగా భగ్గుమన్నారు. వెంటనే దీనిపై నిజానిజాలు తేల్చాలంటూ ఏకంగా ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయంపై విచారణ జరిపిన ఈసీ.. వెంటనే తమకు ఆధారాలు సమర్పించాలంటూ అతిశీకి నోటీసులు జారీ చేసింది.

‘బీజేపీలో చేరిక విషయంలో మీరు చేసిన వ్యాఖ్యలపై మాకు ఫిర్యాదు అందింది. నిజంగా మీకు ఆఫర్ వచ్చి ఉంటే, దానికి తగిన ఆధారాలు సమర్పించండి. ఆ ఆధారాలు మీ వద్ద ఉన్నాయని మేం భావిస్తున్నాం. వాటిని సోమవారం లోగా మాకు అందించాలని కోరుతున్నాం’ అని ఈసీ తన నోటీసులో పేర్కొంది. ఇక ఈసీ నోటీసులపై స్పందించిన ఆతిశీ.. ఎన్నికల సంఘం ఏమైనా బీజేపీకి అనుబంధ సంస్థా? అంటూ ప్రశ్నలు గుప్పించారు. ఈ-మెయిల్‌ ద్వారా తనకు నోటీసులు అందడానికి గంట ముందే బీజేపీ ద్వారా ఈ విషయం మీడియాకు తెలిసిందని ఆమె ఆరోపించారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :