ASBL NSL Infratech

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై భయాందోళనలు..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై భయాందోళనలు..

సార్వత్రిక ఎన్నికల వేళ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. ఏపీ ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తోంది. కొత్త చట్టంతో తమ భూములు ఎక్కడ కబ్జా అవుతాయో అన్న భయం వారిని వేధిస్తోంది. దీనికి తోడు ఇందులో ఉన్న నిబంధనలపై పలు అనుమానాలు ప్రచారం కావడంతో.. ఈచట్టం తమకొద్దంటూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అది సాదారణ ప్రజల నుంచి న్యాయవాదుల వరకూ అందరూ ఈ చట్టం వద్దంటున్నారు. కొత్త చట్టం వల్ల తమ భూములకు రక్షణ లేకుండా పోతాయని.. తమకు తెలియకుండానే వేరే వ్యక్తులు తమ భూములను కాజేసే అవకాశం ఉంటుందని జనం భయపడుతున్నారు. భూ వివాదాల కోసం సివిల్స్ కోర్టులను ఆశ్రయించకుండా చేయడం వల్ల సమస్య మరింత క్లిష్టంగా మారుతుందని.. ట్రైబ్యునళ్లను ఆశ్రయించాల్సి రావడంతో సన్న, చిన్నకారు రైతులు తీవ్రంగా ఇబ్బంది పడతారని ప్రతిపక్షాలు చెబుతున్నాయి.

కబ్జాదారులకు వరం ఈచట్టం; విపక్షాలు

ఈ చట్టం భూకబ్జాదారులకు వరంగా మారుతుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అధికారులు చేసిన తప్పిదాల కారణంగా.. స్థిరాస్తుల వివాద పరిష్కారం కోసం కోర్టులకు వెళ్లిన ప్రజలు.. ఇప్పుడు పరిష్కారం కోసం తిరిగి అధికారుల దగ్గరకే వెళ్లాల్సి వస్తోందని లాయర్లు ఆరోపిస్తున్నారు. పారిశ్రామికవేత్తలు పెద్ద మొత్తంలో భూములను సేకరించాలనుకుంటే.. ఇబ్బందులు తలెత్తుతున్నాయనే ఉద్దేశంతో.. భూమిపై వివాదాలు కోర్టుల పరిధిలో ఉండొద్దనే ఉద్దేశంతో కేంద్రం ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని న్యాయవాదులు చెబుతున్నారు. భూమి క్రయవిక్రయాల సమయంలో జరిగే అవకతవకలను ట్రైబ్యునళ్లలో ప్రభుత్వం నియమించే టీఆర్వోలు పరిష్కరిస్తారని ప్రభుత్వం చెబుతుండగా.. దీని వల్ల ప్రజలకు లాభం కంటే నష్టమే ఎక్కువని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

మీ భూమి మీది కాకుండా పోతుందా..?‘‘మీ పేరు మీదున్న భూమి.. తెల్లారే సరికే వేరే ఎవరి పేరు మీదో మారుతుంది.. మీ ఆస్తులకు మీరు యజమాని కాకుండా పోతారు.. భూయాజమాన్య వివాదాలపై విచారణ జరిపి తీర్పులిచ్చే అధికారం సివిల్స్ కోర్టులకు లేకుండా చేశారు.. కేవలం అప్పిలేట్ ట్రైబ్యునల్‌‌ను మాత్రమే ఆశ్రయించాలి. మీ భూమి ఎవరి పేరిట మారిందనేది మీకు మీరుగా తెలుసుకోవాలి. 90 రోజుల్లోగా తెలుసుకోలేకపోతే ఇక అంతే సంగతులు’’ అని ప్రచారం చేస్తున్న విపక్షం ప్రజల ఆందోళనను మరింత పెంచుతోంది.

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం భూ యజమానిని ఒకసారి నిర్ధారిస్తే అదే ఫైనల్ అని.. భూ వివాదం కారణంగా భూములను కోల్పోయే అవకాశం ఉండదని ప్రభుత్వం చెబుతోంది. టైటిల్‌ రిజిస్టర్‌లో పేరు నమోదైన తర్వాత.. రెండేళ్లలోపే అభ్యంతరాలు వ్యక్తం చేయాలని.. ఒకవేళ రెండేళ్లలోపు అభ్యంతరాలేవీ లేకపోతే.. ఆ తర్వాత కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉండదని ప్రభుత్వం చెబుతోంది.

చట్టంపై పలు అనుమానాలు...

అయితే టీఆర్వోలుగా ఎవరిని నియమిస్తారు..? దీనికి సంబంధించిన మార్గదర్శకాలేంటి..? ఈ ట్రైబునళ్లు స్వయంప్రతిపత్తితో పని చేయగలవా..? ప్రభుత్వంలోని కీలక నేతల నుంచి వచ్చే ఒత్తిళ్లను టీఆర్వోలు ఎలా అధిగమిస్తారు..? కోర్టుల పరిధి నుంచి భూ వివాదాలను తప్పించడం వల్ల తలెత్తే పర్యవసనాలేంటి..? భూ యజమాన్య హక్కులు మారినప్పుడు.. పాత యజమానికి సమాచారం ఇస్తారా..? యజమానికి వేరే ప్రదేశంలో ఉంటే ఎలా..? ఇలా చాలా ప్రశ్నలకు సమాధానం ఇస్తేనే.. ఈ చట్టం పట్ల ప్రజల్లో నమ్మకం కలుగుతుంది. ప్రజలకు పూర్తి అవగాహన వచ్చాకే ఇలాంటి చట్టాలను అమలు చేస్తే అటు ప్రజలు, ఇటు అధికారంలో ఉన్నవారికి కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవనే భావన వ్యక్తం అవుతోంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :