కర్ణ మీద కొత్త ప్రణాళికలు
బాలీవుడ్ లో రామాయణం సినిమా సెట్స్ పైకి వెళ్లడంతో ఆ తరహా సినిమాలను ప్లాన్ చేసుకున్న నిర్మాతలు, హీరోలందరూ ఒక్కసారిగా అలెర్ట్ అయిపోతున్నారు. అందులో ఒకటి కర్ణ. కోలీవుడ్ హీరో సూర్య, రాకేష్ ఓం ప్రకాష్ మెహరా కాంబోలో ఈ భారీ పాన్ ఇండియా సినిమాకు ఏడాది కిందటే ప్లాన్ చేసుకుని అనౌన్స్మెంట్ కూడా చేశారు. కానీ షూటింగ్ మాత్రం ఇప్పటికీ మొదలవలేదు.
మధ్యలో సినిమా ఆగిపోయిందనే వార్తలు కూడా వచ్చాయి. బడ్జెట్ తో పాటూ సూర్య డేట్స్ కూడా కుదరకపోవడంతో ఇన్నాళ్లు సినిమాను మొదలుపెట్టకుండా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టులో కదలికలొచ్చినట్లు సమాచారం. బడ్జెట్ ను కొంచెం తగ్గించి సూర్య మార్కెట్ కు తగ్గట్లు ఖర్చు పెట్టేలా ప్లాన్స్ రెడీ చేస్తున్నారట.
ప్రస్తుతం కంగువ ను పూర్తి చేసే పనిలో ఉన్న సూర్య ఆ తర్వాత వెట్రిమారన్ దర్శకత్వంలో వడివాసల్ చేస్తున్నాడు. ఇది కాకుండా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రోలెక్స్ అంటున్నారు కానీ అది ఇప్పట్లో కుదిరేలా లేదు. ఒకవేళ కర్ణకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ వేగంగా అయిపోతే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్సుంది. కాకపోతే కొంచెం టైమ్ పట్టడం మాత్రం ఖాయం.