ఏపీ పోలింగ్ వివరాలు వెల్లడించిన ముఖేశ్ కుమార్ మీనా..
సోమవారం నాడు ఏపీలో భారీగా పోలింగ్ నమోదైనట్లు, పలుచోట్ల అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా సుమారు రెండు గంటల వరకు పోలింగ్ కొనసాగినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించిన సీఈఓ.. ఎన్నికలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మొత్తం 3500 కేంద్రాలలో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిగిందని ఆయన పేర్కొన్నారు. అలాగే ఆఖరి పోలింగ్ కేంద్రంలో రాత్రి రెండు గంటలకు పోలింగ్ ముగిసినట్లుగా తెలియజేశారు. ఈసారి ఎన్నికల్లో 81.86 పోలింగ్ నమోదైనట్లు మీనా తెలియజేశారు. ఈవీఎంల నమోదైన శాతం 80.66 కాగా పోస్టల్ బ్యాలెట్‌తో 1.2 శాతం నమోదు అయింది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం 2.09 పెరిగింది. ఈ ఎన్నికల్లో దర్శిలో అత్యధికంగా 90.91 శాతం ఓటింగ్ నమోదు కాగా.. తిరుపతిలో అత్యల్పంగా 63.32 ఓటింగ్ శాతం నమోదయినట్లు తెలిపారు.
లోక్ సభ స్థానాలలో ఒంగోలులో అత్యధికంగా 87.06 శాతం నమోదు కాగా..విశాఖలో అత్యల్పంగా 71.11 శాతం పోలింగ్ నమోదయినట్లు సీఈఓ చెప్పారు. 25 లోక్ సభ స్థానాలకు 454 మంది పోటీ చేయగా.. 175 శాసనసభ నియోజకవర్గ స్థానాలకు 2,387 మంది అభ్యర్థులు బరిలో దిగారు. ఆంధ్రాలో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. రాష్ట్రవ్యాప్తంగా 46, 389 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు ఎన్నికల సంఘం ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రక్రియ కోసం సుమారు లక్షా 60 వేల ఈవీఎంలు వినియోగించారు. ఎన్నికల సందర్భంలో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఓటింగ్ పూర్తయిన తర్వాత కూడా ఇంకా కొన్ని ప్రాంతాలలో ఉద్రిక్తత కొనసాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఓటింగ్ కు ఉపయోగించిన ఈవీఎంలన్నీ 350 స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచినట్లు ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. ఎన్నికల్లో పాల్గొన్న సిబ్బందికి ఈ నేపథ్యంగా ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. జూన్ 4న జరగబోయే లెక్కింపు తర్వాత ఫలితాలు వెలబడతాయని మీనా తెలిపారు.
జిల్లాలవారీగా ఓటింగ్ శాతం వివరాలు..
అల్లూరి సీతారామరాజు 72.20
అనకాపల్లి 83.84
అనంతపురం 81.08
అన్నమయ్య 77.83
బాపట్ల 85.15
చిత్తూరు 87.09
అంబేద్కర్ కోనసీమ 83.84
తూర్పు గోదావరి 80.93
ఏలూరు 83.67
గుంటూరు 78.81
కాకినాడ 80.31
కృష్ణా 84.05
కర్నూలు 76.42
నంద్యాల 82.09
ఎన్టీఆర్ 79.36
పల్నాడు 85.65
పార్వతీపురం మన్యం 77.10
ప్రకాశం 87.09
పొట్టిశ్రీరాములు నెల్లూరు 79.63
శ్రీ సత్యసాయి 84.63
శ్రీకాకుళం 75.59
తిరుపతి 78.63
విశాఖపట్నం 70.03
విజయనగరం 81.33
పశ్చిమ గోదావరి 82.59
వైఎస్సార్ 79.58