Visa: అమెరికా మరో కీలక నిర్ణయం… ఇది తక్షణమే అమల్లోకి

విదేశీయులకు వీసాలు జారీ చేసే ప్రక్రియను కఠినతరం చేస్తున్న అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. వాణిజ్య ట్రక్కులు నడిపే డ్రైవర్లకు ఇకపై వర్కర్ వీసాలు జారీ చేయబోమని స్పష్టం చేసింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. అమెరికా రోడ్లపై భారీ ట్రక్కులు నడిపే విదేశీ డ్రైవర్ల సంఖ్య పెరుగుతోంది. వీరి నిర్లక్ష్యం కారణంగా అమెరికన్ల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి. అమెరికా డ్రైవర్ల జీవనోపాదికీ గండి పడుతోంది అని అమెరికా విదేశాంగశాఖ మంత్రి మార్కో రూబియో (Marco Rubio) పేర్కొన్నారు. ఫ్లోరిడా (Florida) లోని హైవేపై ఓ ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యంగా యూటర్న్ తీసుకొని ముగ్గురు ప్రాణాలు బలిగొన్న నేపథ్యంలో రుబియో ఈ ప్రకటన చేశారు. విదేశీ ట్రక్కు డ్రైవర్లపై ఆంక్షలకు ఉపక్రమించిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) యంత్రాంగం, డ్రైవర్లకు ఆంగ్లం చదవడం, రాయడం వచ్చి ఉండటాన్ని తప్పనిసరి చేసింది. రోడ్లపై సూచికలు చదవలేకపోవడం, ఇంగ్లిష్‌లో మాట్లాడకపోవడం వల్లే అనేక ప్రమాదాలకు డ్రైవర్లు కారణమవుతున్నారని రవాణాశాఖ పేర్కొంది.