Donald Trump :చైనా విషయంలో డొనాల్డ్ ట్రంప్ యూటర్న్

చైనా విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ద్వంద్వ వైఖరి ఆశ్చర్యపరుస్తోంది. ఓ వైపు టారిఫ్‌లపై బీజింగ్ (Beijing )కు వార్నింగ్ ఇస్తూ వాణిజ్య యుద్ధానికి కాలుదువ్వుతూనే చైనా విద్యార్థులకు అమెరికా తలుపులు తెరుస్తున్నారు. ఏకంగా 6 లక్షల మంది చైనీస్ విద్యార్థులను అగ్రరాజ్యానికి ఆహ్వానిస్తున్నారు. ట్రంప్ తీరు సొంత పార్టీ నేతలను అసహనానికి గురిచేస్తోంది. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వలసదారులు, విదేశీ విద్యార్థుల విషయంలో కఠిన నిబంధనలు అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా చైనాలో కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన వారు, పరిశోధన రంగంలో ఉన్నవారికి వీసాలు రద్దు చేస్తామని బహిరంగంగానే హెచ్చరికలు చేశారు. భారత్ (India) సహా ఇతర దేశాల విద్యార్థుల వీసాల ప్రక్రియను కూడా కఠినతరం చేశారు. ఈ క్రమంలోనే తాజాగా చైనా (China) విషయంలో డొనాల్డ్ ట్రంప్ యూటర్న్ తీసుకోవడం గమనార్హం.