ఆరునెలల్లో ప్రారంభిస్తాం… లేదంటే మంత్రి పదవికి
వరంగల్ పట్టణ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నానని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ అభివృద్ధి కోసం 250 కోట్ల రూపాయల టెండర్లు పిలిచామని పేర్కొన్నారు. ఆరు నెలల్లో టెక్స్టైల్ పార్క్ ప్రారంభిస్తామని భరోసా ఇచ్చారు. ఆరు నెలలో పనులు ప్రారంభించకపోతే మంత్రి పదవికి రాజీనామబా చేస్తానని అన్నారు. గిరిజన యూనివర్సిటీ కోసం భూమిని ఇప్పటికే కేటాయించామని కానీ కేంద్ర ప్రభుత్వం గిరిజన యూనివర్సిటీ మంజూరు చేయడం లేదని అన్నారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడం లేదని, రైలు కోచ్ ఫ్యాక్టరీ కోసం నిరంతర పోరాటం చేస్తామని అన్నారు. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అర్థ రహితమని కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి ఆసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.







