కౌశిక్ రెడ్డి – అరికెపూడి హడావుడి.. తగ్గే ఛాన్సే లేదా..?

తెలంగాణలో మూడు రోజులుగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. టెక్నికల్ ఇది ఇద్దరు బీఆర్ఎస్ నేతల మధ్య జరుగుతున్న యుద్ధం. అయితే ఆ స్టేజ్ దాటిపోయింది. దీంతో పార్టీలు ఇన్వాల్వ్ కాక తప్పని పరిస్థితి ఏర్పడింది. పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే. అరికెపూడి గాంధీ కూడా టెక్నికల్ గా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. అరికెపూడి గాంధీకి ఈ మధ్య పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ గా ఛాన్స్ దొరికింది. స్పీకర్ ఆయనకు ఆ పదవి కట్టబెట్టారు. ఇది బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య అగ్గి రాజేసింది. కాంగ్రెస్ కండువా కప్పుకున్న వ్యక్తికి పీఏసీ పదవి ఎలా ఇస్తారనేది బీఆర్ఎస్ ప్రశ్న.
సహజంగా పాడి కౌశిక్ రెడ్డికి ఆవేశం ఎక్కువ. గతంలో కూడా పలు సందర్భాల్లో కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. కౌశిక్ రెడ్డికి కళ్లెం వేయాలని కొందరు సొంత పార్టీ నేతలే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు టాక్. అయితే ఇప్పుడు పార్టీకి కావాల్సింది కౌశిక్ రెడ్డి లాంటి వాళ్లే. అరికెపూడి గాంధీకి పీఏసీ పదవి ఇవ్వగానే పార్టీ మారినోళ్లందరికీ చీర, గాజులు పంపిస్తున్నట్టు పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. దీంతో అరికెపూడి గాంధీకి ఆత్మగౌరవం అడ్డొచ్చింది. ఎప్పుడూ వివాదాల జోలికి పోని అరికెపూడి గాంధీ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.
అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్తానన్న కౌశిక్ రెడ్డి రాకపోవడంతో గాంధీయే కౌశిక్ రెడ్డి ఇంటికెళ్లాడు. అక్కడ హంగామా నడిచింది. దీంతో అటు అరికెపూడి గాంధీ పైన, ఇటు పాడి కౌశిక్ రెడ్డిపైనా కేసులు పెట్టారు. ఇద్దరు బీఆర్ఎస్ నేతల మధ్య ఇష్యూ జరిగితే తమనెందుకు లాగుతున్నారని కాంగ్రెస్ కౌంటర్ ఎటాక్ స్టార్ట్ చేసింది. ఇంతవరకూ బాగానే ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుని మాటల తూటాలు పేల్చారు. స్వయంగా కేటీఆర్.. రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. దీన్ని సహించలేని కాంగ్రెస్ నేతలు జగ్గారెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు.. తమ సీఎం జోలికొస్తే నాలుక కోస్తాం అని హెచ్చరించారు.
కౌశిక్ రెడ్డి రాజేసిన రచ్చ ఇప్పుడు రెండు పార్టీలకు చుట్టుకుంది. అరికెపూడి గాంధీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారని బీఆర్ఎస్ చెప్తుంటే.. లేదని కాంగ్రెస్ వాదిస్తోంది. నాడు కాంగ్రెస్ నేతలకు కేసీఆర్ కండువా కప్పాడని హస్తం పార్టీ నేతలు చెప్తుంటే.. బీఆర్ఎస్ ఖండిస్తోంది. దీంతో ఇరు పార్టీలూ గతాన్ని తవ్వుకుంటూ నాడు కేసీఆర్ కండువా కప్పిన ఫోటోలను బయట పెడుతున్నారు. దీంతో ఈ వివాదానికి ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడేలా కనిపించట్లేదు. ఇద్దరు నేతల మధ్య రగలిన రచ్చ ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య గ్యాప్ వచ్చే వరకూ వెళ్లింది. మరి ఈ ఇష్యూ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.