తెలంగాణలో ఆక్సిజన్ కొరత లేదు… ఆర్మీ సాయంతో
తెలంగాణ రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రభుత్వాస్పత్రుల్లోనూ ఆక్సిజన్ కొరత లేదని స్పష్టం చేశారు. అన్ని జిల్లాలకు ఆక్సిజన్‌ను రవాణా చేస్తున్నామన్నారు. ఆర్మీ విమానాల ద్వారా ఆక్సిజన్‌ను సరఫరా చేసుకున్న తొలి రాష్ట్రం తెలంగాణ అన్నారు. 4 లక్షల రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు గతంలోనే ఆర్డర్ ఇచ్చామని వ్యాఖ్యానించారు. ఆక్సిజన్ పర్యవేక్షణకు ఐఏఎస్ అధికారుల నియామకం చేపట్టినట్లు తెలిపారు. పీఎం కేర్ నుంచి 5 ఆక్సిజన్ మిషన్లు వచ్చాయన్నారు. ప్రస్తుతం రోజుకు 270 టన్నుల ఆక్సిజన్ అవసరం ఉంటుందని, ఈ నేపథ్యంలో నిత్యం 400 టన్నులు రాష్ట్రానికి వచ్చేలా ఏర్పాట్లు చేసినట్లు స్పష్టం చేశారు. 10 వేల బెడ్స్‌కు ఆక్సిజన్ సదుపాయం కల్పించినట్లు తెలిపారు. గాంధీలో అదనంగా మరో 400 ఆక్సిజన్ బెడ్లు, టిమ్స్‌లో అదనంగా 300, నాచారం ఈఎస్ఐ ఆస్పత్రిలో 350, నిమ్స్‌లో అదనంగా మరో 200 ఆక్సిజన్ బెడ్లు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. అదేవిధంగా వారంలో మరో 3,500 ఆక్సిజన్ బెడ్లు అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు.







