చుంగ్‌గేచంగ్ నదిని పరిశీలించిన సీఎం రేవంత్ బృందం

దక్షిణ కొరియా రాజధాని సియోల్ నగరం నడిబొడ్డున ప్రవహించే చుంగ్‌గేచంగ్ నదీ పరిసరాలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నేతృత్వంలోని ప్రతినిధి బృందం పరిశీలించింది. హైదరాబాద్ మూసీ రివర్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఉన్న ముఖ్యమంత్రి సియోల్‌లోని చుంగ్‌గేచంగ్ నదిని ప్రపంచస్థాయి వాటర్ ఫ్రంట్‌గా తీర్చిదిద్దిన తీరుతెన్నులను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. ఈ నది సుందరీకరణ జరిగిన తీరుతెన్నులు గమనించిన తర్వాత మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌పై అనేక ఆలోచనలకు అవకాశం ఇచ్చిందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. దాదాపు 11 కిలోమీటర్ల ఈ నది విపరీతమైన కలుషితాలతో ఉండేది. ఈ నదిని 2005 నాటి నుంచి పునరుద్ధరణ పనులతో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రివర్ ఫ్రంట్‌గా తీర్చిదిద్దిన తర్వాత సియోల్ నగరవాసులే కాకుండా ప్రపంచ నలుమూలల నుంచి ఏటా దాదాపు 19 కోట్ల మంది పర్యాటకులు సందర్శిస్తున్నారు.