తెలంగాణకు మరో ప్రముఖ సంస్థ రాక.. రూ.225 కోట్ల పెట్టుబడితో
తెలంగాణకు మరో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల సంస్థ రానుంది. ప్రఖ్యాత టీసీఎల్ గ్రూప్ రాష్ట్రంలో తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. తెలంగాణకు చెందిన రిసోజెట్ సంస్థతో కలసి వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్‌ను రాష్ట్రంలో నెలకొల్పనుంది. ఈ మేరకు చైనాలో జరిగిన కార్యక్రమంలో రిసోజెట్-టీసీఎల్ గ్రూప్‌ల మధ్య పరస్పరం అవగాహన ఒప్పందం కుదరగా, హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, రాష్ట్ర ఎలక్ట్రానిక్స్ విభాగం డైరెక్టర్ సుజయ్ కారంపురి తదితరులు ఆన్లైన్లో పాల్గొన్నారు.
కన్జ్యూమర్ ప్రొడక్ట్ రంగంలో విస్తృత ఉత్పత్తుల శ్రేణిని కలిగిన టీసీఎల్ ఎలక్ట్రానిక్స్ తన ప్రధాన కేంద్రమైన చైనాలోని హెఫెయి నగరం తర్వాత, విదేశంలో ఏర్పాటు చేస్తున్న తొలి తయారీ యూనిట్ ఇదే కావడం విశేషం. తొలుత వాషింగ్ మెసిన్లను తయారు చేసేందుకు ఉద్దేశించిన ఈ తయారీ కేంద్రం నుంచి సమీప భవిష్యత్తులో రిఫ్రిజిరేటర్లు, డిష్వాషర్లను కూడా ఉత్పత్తి చేసేందుకు విస్తరించనుంది. రంగారెడ్డిలోని రావిర్యాలలో ఉన్న ఈ సిటీలో రూ.225 కోట్ల పెట్టుబడితో తయారీ యూనిట్‌ను నెలకొల్పనున్నారు. దీని ద్వారా 500 మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు తొలిదశలోనే రానున్నాయి.






