Suravaram : రాజకీయాల్లో సురవరం కీలక పాత్ర : సీఎం రేవంత్ రెడ్డి
పేదల జీవితాలలో మార్పు రావాలని, వారి కోసం నిరంతరం శ్రమించిన గొప్ప నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి (Suravaram Sudhakar Reddy) అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. రవీంద్రభారతిలో నిర్వహించిన సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభకు సీఎం హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తను నమ్మిన సిద్ధాంతాలను చివర వరకు ఆచరించిన అవిశ్రాంత యోధుడని కొనియాడారు. సమాజంలో అనాగరికాలు రూపుమాపేలా ఆయన ఎన్నో చైతన్య కార్యక్రమాలు చేపట్టారన్నారు. మొదటితరంలో సురవరం ప్రతాపరెడ్డి (Pratap Reddy) , బూర్గుల రామృకష్ణారావు (Burgula Ramrukashna Rao) వంటి వారు పాలమూరు జిల్లాకు వన్నెతెచ్చారు. రెండో తరంలో జైపాల్ రెడ్డి (Jaipal Reddy) , సురవరం సుధాకర్ రెడ్డి వంటివారు రాజకీయాల్లో రాణించారు. సురవరం సుధాకర్‌రెడ్డి గుర్తింపు, ఆయన సిద్ధాంతాలు ప్రజలకు అర్థమయ్యేలా చేస్తాం. ప్రజలకు సురవరం సుధాకర్ రెడ్డి ఎప్పుడూ గుర్తుండేలా మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. రాజకీయం అంటేనే అధికారం అన్నట్టుగా కొందరు వ్యవహరిస్తున్నారు. అధికారంలో ఉంటాం కానీ, ప్రతిపక్షంగా ఉండలేమన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఐదేళ్లు కూడా ప్రతిపక్షంలో ఉండేందుకు ఇష్టపడతారు. ప్రజల తరపున మాట్లాడటం, పోరాడటం పెద్ద బాధ్యత. ప్రస్తుత రాజకీయాల్లో ప్రజల తరపున పోరాడేందుకు నేతలు ముందుకు రావట్లేదు. సమస్యలపై పోరాడి, ప్రజావ్యతిరేక ప్రభుత్వాలను దించడంలో కమ్యూనిష్టులు ముందున్నారు అని రేవంత్ వ్యాఖ్యానించారు.







