MLAs Case: క్లైమాక్స్‌కు చేరిన ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల పంచాయితీ
తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) కొంతకాలంగా తీవ్ర చర్చనీయాంశమైన ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల (Defected MLAs) వ్యవహారం ఇప్పుడు నిర్ణయాత్మక దశకు చేరుకుంది. సుప్రీంకోర్టు (Supreme Court) విధించిన గడువు ముంచుకొస్తున్న వేళ, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ (Assembly Speaker Gaddam Prasad) ఫిరాయింపుదారులపై అనర్హత వేటు ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ క్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్ (Danam Nagendar), కడియం శ్రీహరిలకు (Kadiyam Srihari) స్పీకర్ మరోసారి నోటీసులు జారీ చేయడం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను రేపుతోంది.
మిగతా ఎమ్మెల్యేల విచారణ ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చినప్పటికీ, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నుంచి ఇప్పటివరకు సరైన స్పందన లేకపోవడంతో స్పీకర్ కార్యాలయం సీరియస్‌గా స్పందించింది. వీరిద్దరూ ఈ నెల 23వ తేదీలోగా తమ సమాధానాలను అఫిడవిట్ రూపంలో కచ్చితంగా సమర్పించాలని స్పీకర్ ఆదేశించారు. గతంలో జారీ చేసిన నోటీసులకు వీరి నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతోనే ఈ తాజా నోటీసులు జారీ అయినట్లు తెలుస్తోంది.
మొత్తం 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో.. దానం, కడియం మినహా మిగిలిన 8 మంది ఎమ్మెల్యేల విచారణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. వీరు ఇప్పటికే తమ అఫిడవిట్లను అసెంబ్లీ కార్యదర్శికి సమర్పించారు. గురువారం జరిగిన విచారణలో ఫిర్యాదుదారులు, ఈ 8 మంది ఎమ్మెల్యేల తరఫు న్యాయవాదులు స్పీకర్ సమక్షంలో తమ తుది వాదనలను వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం స్పీకర్ వీరిపై తీర్పును రిజర్వ్ చేశారు. ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, అరెకపూడి గాంధీ, గూడెం మహిపాల్‌రెడ్డి, తెల్లం వెంకట్రావు, కాలే యాదయ్య, డాక్టర్ సంజయ్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి విచారణ ప్రక్రియ పూర్తయింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఏ క్షణమైనా వీళ్లపై నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.
ఈ మొత్తం ప్రక్రియ ఇంత వేగంగా జరగడానికి ప్రధాన కారణం సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడమే.! ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడంలో స్పీకర్ జాప్యం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుప్రీంను ఆశ్రయించడంతో, న్యాయస్థానం మొదట మూడు నెలల గడువు విధించింది. ఆ గడువు ముగిసినప్పటికీ విచారణ పూర్తికాకపోవడంతో, స్పీకర్ అభ్యర్థన మేరకు ఇటీవలే సుప్రీంకోర్టు మరో నాలుగు వారాలపాటు గడువును పొడిగించింది. ఈ గడువు ముగిసేలోగా నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితి స్పీకర్‌కు ఏర్పడింది.
దానం నాగేందర్, కడియం శ్రీహరి కేసులో రాబోయే నాలుగు వారాలు అత్యంత కీలకం కానున్నాయి. ఈ నెల 23లోగా దానం, కడియం తమ సమాధానాలను సమర్పించాల్సి ఉంది. వాళ్లు ఇచ్చిన సమాధానాలను బీఆర్ఎస్ పిటిషనర్లకు పంపిస్తారు. వాళ్ల సమాధానాలపై బీఆర్ఎస్ అభ్యంతరాలు, ఆధారాలను స్పీకర్ కోరుతారు. అనంతరం ఇరుపక్షాల న్యాయవాదుల సమక్షంలో వాదనలు జరుగుతాయి. చివరగా, న్యాయ నిపుణుల సలహా తీసుకుని, సుప్రీంకోర్టు గడువు ముగిసేలోగా స్పీకర్ తన నిర్ణయాన్ని వెల్లడించి, నివేదికను కోర్టుకు సమర్పిస్తారు.
మొత్తం మీద తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల డ్రామా ముగింపు దశకు చేరింది. 8 మంది ఎమ్మెల్యేల భవితవ్యం ఇప్పటికే సీల్ కాగా, దానం, కడియంలు చివరి నిమిషంలో తమ వాదనలను ఎలా వినిపిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. సుప్రీంకోర్టు డెడ్‌లైన్ కత్తి తలపైన వేలాడుతుండటంతో, ఈసారి నిర్ణయం వాయిదా పడే అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి. స్పీకర్ తీర్పు తర్వాత రాబోయే నెల రోజుల్లో తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మారే అవకాశం లేకపోలేదు.






