Revanth Reddy: ముగ్గురు మంత్రులకు ఉద్వాసన పలుకునున్న రేవంత్ సర్కార్..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress ) ఏడాది పాలన పూర్తి చేసుకుంది. అయితే, కీలక శాఖలకు మంత్రులు లేకుండానే పరిపాలన కొనసాగుతుండటం గమనార్హం. మొత్తం 18 మంత్రి పదవులలో ప్రస్తుతం కేవలం 12 పదవులే భర్తీ అయ్యాయి. ముఖ్యమైన హోం, విద్య శాఖలు సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) వద్దే ఉన్నాయి. కేబినెట్ విస్తరణ కోసం సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం పలు సార్లు అధిష్టానం అనుమతి కోరినప్పటికీ, వాయిదాలు మాత్రమే ఎదురవుతున్నాయి.
సీఎం రేవంత్ (C.M Revanth) ఇటీవల చేసిన సర్వేలో 10 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు మంత్రులపై వ్యతిరేకత ఉన్నట్లు గుర్తించారు. ఈ నివేదికను ఢిల్లీలో ఏఐసీసీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం, పార్టీకి చెడ్డపేరు తీసుకురావడంలో ముగ్గురు మంత్రుల పాత్ర ఉందని రేవంత్ అసంతృప్తిగా ఉన్నారు. ఈ ముగ్గురిని కేబినెట్ నుంచి తప్పించాలని అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. కేబినెట్ నుంచి తప్పించబోయే ముగ్గురు మంత్రులు తమ శాఖలపై పట్టుసాధించలేకపోయారని తెలుస్తోంది. వారి వ్యవహార శైలితో వివాదాలు మరింత తీవ్రంగా మారాయి. తొలగించబడే మంత్రులుగా కొండా సురేఖ(Konda Surekha) , జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) , తుమ్మల నాగేశ్వర్‌రావుల(Thummala Nageswara Rao) పేర్లు వినిపిస్తున్నాయి.
కొండా సురేఖ (Konda Surekha) దురుసైన వ్యవహారశైలితో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. విపక్ష నేతలపై, సినీనటులపై, ఇతర రాజకీయ నాయకులపై ఆమె చేసిన విమర్శలు వివాదాస్పదంగా మారాయి. వరంగల్ జిల్లాలో ఆమె జోక్యం పార్టీలో వర్గపోరు కారణమవుతోంది. మెదక్ జిల్లా ఇన్‌చార్జిగా ఆమెకు వచ్చిన ఫిర్యాదులు కూడా సమస్యగా మారాయి. జూపల్లి కృష్ణారావు సీనియర్ నేతగా మంత్రిపదవి పొందినప్పటికీ, తన శాఖను సమర్థంగా నిర్వహించలేకపోయారన్న విమర్శలు ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో ఎమ్మెల్యేలతో ఆయనకు సమన్వయం లేదు. యూబీ గ్రూప్ సంబంధిత సమస్యలను సరిగా పరిష్కరించలేదన్న ఆరోపణలు కూడా ఆయనపై ఉన్నాయి.
తుమ్మల నాగేశ్వర్‌రావు అనుభవజ్ఞుడైన నాయకుడు అయినప్పటికీ, ప్రస్తుతం తన శాఖపై పట్టుసాధించలేకపోయారు. ఖమ్మం జిల్లాలో ఇతర నేతలతో ఆయనకు సత్సంబంధాలు లేకపోవడం విమర్శలకు దారితీసింది. ఒకే జిల్లాకు మూడు మంత్రి పదవులు రావడం కూడా ఆయనకు వ్యతిరేక పరిస్థితులను సృష్టించింది. ఇక ఈ ముగ్గురిని తొలగించడం వల్ల పార్టీకి నష్టం జరిగే అవకాశముందా అనే విషయంపై కూడా రేవంత్ సర్వే నిర్వహించారు. చివరకు, ఈ నిర్ణయం ప్రభుత్వ పరిపాలన మెరుగ్గా సాగేందుకు అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.