Revanth Reddy: వావ్.. దిమ్మదిరిగేలా రేవంత్ రెడ్డి స్ట్రాటజీ..!!

తెలంగాణలో (Telangana) ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ (BJP) ప్రయత్నిస్తోంది. మరోవైపు ఎలాగైనా అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ (BRS) పరితపిస్తోంది. ఈ రెండు పార్టీలకూ చెక్ పెట్టి మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) కృతనిశ్చయంతో ఉన్నారు. అందుకే ఆ రెండు పార్టీలను వ్యూహాత్మంగా అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓ వైపు బీఆర్ఎస్ అంతర్గత సమస్యలతో సతమతమవుతోంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం పెడుతున్న కేసులు ఆ పార్టీకి పెద్ద సమస్యగా మారాయి. బీఆర్ఎస్ పనైపోయిందని భావిస్తున్న బీజేపీ.. ఆ స్థానాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. అయితే ఆ రెండు పార్టీలకు చెక్ పెట్టేలా రేవంత్ రెడ్డి ఎత్తుగడలు వేస్తున్నారు.
కాళేశ్వరం (Kaleswaram) ప్రాజెక్టుపై విచారణను సీబీఐకి (CBI) అప్పగిస్తూ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యం కలిగించింది. కేసీఆర్ (KCR) ఫ్యామిలీ చుట్టూ ఉచ్చు బిగించి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నా కూడా రేవంత్ రెడ్డి ఎందుకు కాళేశ్వరం అంశాన్ని కేంద్రంలో చేతిలో పెట్టారనేది చాలా మందికి అంతు చిక్కలేదు. అయితే దీని వెనుక పెద్ద వ్యూహమే దాగి ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా బీజేపీని ఇరుకున పెట్టేందుకు ఈ ఎత్తుగడ వేశారని అర్థమవుతోంది. కాళేశ్వరంపై విచారణను సీబీఐకి అప్పగించాలని బీజేపీ పలుమార్లు డిమాండ్ చేసింది. ఆ పని చేయడం ద్వారా బీజేపీ కోరిక నెరవేర్చారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని, ఆ రెండు పార్టీలూ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని బీజేపీ పదేపదే విమర్శిస్తోంది. దీనికి చెక్ పెట్టాలంటే బీజేపీని కూడా ముగ్గులోకి లాగాలి. రేవంత్ రెడ్డి అదే పని చేశారు. కాళేశ్వరంపై విచారణను సీబీఐకి అప్పగించడం ద్వారా బీజేపీ చేతిలో తాళం చెవి పెట్టారు. ఇప్పుడు అది కాళేశ్వరంపై విచారణ చేపట్టి నిజానిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఏర్పడింది. ఒకవేళ ఇందులో కేసీఆర్ దోషిగా తేలితే తాము చెప్పిందే రైట్ అని రేవంత్ రెడ్డి జబ్బలు చరుచుకోవచ్చు. ఒకవేళ కేసీఆర్ కు సీబీఐ క్లీన్ చిట్ ఇస్తే బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని, అందుకే కేసీఆర్ ను కాపాడిందని విమర్శించవచ్చు. దీన్ని బట్టి ఆ రెండు పార్టీల జుట్టును రేవంత్ రెడ్డి తన చేతిలో పెట్టుకున్నట్టు అర్థమవుతోంది.
మరోవైపు బీసీ రిజర్వేషన్ల అంశాన్ని కూడా కేంద్రం చేతిలో పెట్టి ఇప్పటికే బీజేపీని టార్గెట్ చేశారు రేవంత్ రెడ్డి. రాష్ట్రపతితో ఆమోదముద్ర వేయించాలని బీజేపీని పదేపదే డిమాండ్ చేస్తున్నారు. ప్రధాని మోదీ తనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదని విమర్శిస్తున్నారు. దీంతో బీజేపీ ఇరకాటంలో పడింది. రిజర్వేషన్లను ఆమోదిస్తే క్రెడిట్ కాంగ్రెస్ కొట్టేస్తుంది. ఒకవేళ ఆమోదించకపోతే బీజేపీని టార్గెట్ చేయవచ్చు. రాష్ట్రంలో ఆ పార్టీని దోషిగా నిలబెట్టవచ్చు.
ఇక బీఆర్ఎస్ ఇప్పటికే అంతర్గత సమస్యలతో సతమతమవుతోంది. కేసీఆర్ కుటుంబంలో కవిత వేరుకుంపటి పెట్టుకునేందుకు సిద్ధమైంది. దీంతో ఆ పార్టీలో గందరగోళ పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో తనంతట తానుగా కేసీఆర్ ఫ్యామిలీపై ఏవైనా చర్యలు తీసుకుంటే వాళ్లకు సానుభూతి కలిగే అవకాశం ఉంది. అది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి ఇబ్బందికరంగా మారొచ్చు. అందుకే తన చేతిలో పవర్ ఉన్నా కూడా కేసీఆర్ ఫ్యామిలీపై చర్యలు తీసుకోకుండా రేవంత్ సంయమనం పాటించారు. తద్వారా కేసీఆర్ పై సానుభూతి రాకుండా జాగ్రత్త పడ్డారు.
రేవంత్ రెడ్డి చూడ్డానికి చిన్నవాడిలా కనిపిస్తారు. ఇతనికి రాజకీయం ఏం తెలుసని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే కాంగ్రెస్ లాంటి మహాసముద్రంలో ఎంతోమంది సీనియర్లకు రాని సీఎం కుర్చీని తాను చేజిక్కించుకున్నప్పుడే రేవంత్ రెడ్డి సత్తా ఏంటో అర్థమైంది. అలాంటిది తనకు రాజకీయం తెలీదనుకుంటే పొరపాటే. పైకి చూడడానికి అతని ఎత్తుగడలు చాలా సింపుల్ గా ఉంటాయి. కానీ లోతుకు వెళ్తే తెలుస్తుంది అతను కొట్టే దెబ్బ ఏ రేంజ్ లో ఉండబోతోందో..!!