Revanth Reddy: ఆ విషయంలో ఏపీ మోడల్‌ను అనుసరిస్తున్న తెలంగాణ?

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu ) చేపట్టిన పాలనాత్మక మార్పులను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అనుసరిస్తున్నారా అనే చర్చ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. అభివృద్ధి పరంగా ఒకరితో ఒకరు పోటీపడుతున్న ఇద్దరు ముఖ్యమంత్రులు కొన్ని విధానాల పరంగా ఒకరినొకరు ఫాలో అవుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రిజిస్ట్రేషన్ వ్యవస్థలో తీసుకొచ్చిన స్లాట్ బుకింగ్ విధానంపై చర్చ మొదలైంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల రిజిస్ట్రేషన్ల శాఖలో(AP Registration Department )అవినీతిని తగ్గించడం, దళారీ వ్యవస్థను తొలగించడం, ప్రజల సమయాన్ని ఆదా చేయడం వంటి లక్ష్యాలతో స్లాట్ బుకింగ్ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి తీసుకొచ్చింది. ఈ విధానం ద్వారా ప్రజలు ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో ముందుగా సమయం బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయాలకు వెళ్తున్నారు. ఫలితంగా తక్కువ సమయంలోనే తమ పని పూర్తయ్యి ఇంటికి తిరిగి వెళ్తున్నారు. సెలవు రోజుల్లో కూడా సేవలు అందుబాటులో ఉండటంతో ప్రజలకు మరింత లాభంగా మారింది. అంతేకాకుండా ప్రభుత్వ ఆదాయం కూడా పెరుగుతోందని చెబుతున్నారు.
ఈ విధానం విజయవంతంగా కొనసాగుతున్న ఏపీని చూసి, తెలంగాణ ప్రభుత్వం కూడా అదే విధానాన్ని తమ రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించింది. తొలి దశలో తెలంగాణలోని 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 22 కార్యాలయాల్లో ఈ విధానాన్ని ప్రారంభించనున్నారు. అక్కడి అనుభవాలను బట్టి తర్వాత పూర్తిస్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా అమలుచేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనివల్ల ప్రజలు ముందుగా స్లాట్ బుక్ చేసుకుని తక్కువ సమయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.
ప్రతి కార్యాలయంలో రోజువారీ వ్యవహారాలను 48 స్లాట్లుగా విభజించి, ప్రతి వ్యక్తికి 10-15 నిమిషాల సమయం కేటాయించనున్నారు. అదనంగా, స్లాట్ బుకింగ్ చేయలేకపోయిన వారికోసం ప్రతి రోజు సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకూ ప్రత్యేక సమయం కేటాయించనున్నారు. ఇలా రెండు రాష్ట్రాల్లోనూ రిజిస్ట్రేషన్ వ్యవస్థను సాంకేతికంగా అభివృద్ధి చేస్తూ ప్రజలకు మరింత అందుబాటులోకి తేవడంలో సీఎం చంద్రబాబు, రేవంత్ రెడ్డి చూపిస్తున్న చాతుర్యం గమనార్హం. ఈ మార్పులు ప్రజలకు లాభంగా మారడమే కాకుండా, పాలనలో పారదర్శకతను తీసుకురావడంలో కీలకంగా నిలుస్తున్నాయి.