సీఎం రేవంత్‌ను కలిసిన రావి నారాయణ రెడ్డి సేవా సంస్థ సభ్యులు

అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రావి నారాయణ రెడ్డి సేవా సంస్థ అమెరికా విభాగం సభ్యులు కలిశారు. రావి అనిల్ రెడ్డి, కాగిదాపురం ప్రదీప్ రెడ్డి, బందారం అనిల్‌లు సీఎంను కలిసి 1952 సంవత్సరంలో జరిగిన భారతదేశ తొలి లోక్‌సభ ఎన్నికల్లో దేశం మొత్తం మీద, జవహర్‌లాల్ నెహ్రూ కంటే అత్యధిక మెజారిటీ సాధించి, ప్రథమ పార్లమెంటును ఆరంభించి, ప్రారంభించిన యాదాద్రి భుననగిరి జిల్లా బొల్లేపల్లి వాసి రావి నారాయణ రెడ్డి సేవలను ప్రస్తావించారు. రావి నారాయణ రెడ్డి (రానారె) సంస్థ, ఎన్‌ఆర్‌ఐ విభాగం తరపున ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేశామని ఆ సంస్థ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్, భువనగిరిలో రావి నారాయణ రెడ్డి కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేయాలని, ఆ ప్రాంతాలకు, నిర్మాణాలకు ఆయన పేరు పెట్టాలని కోరారు. పరిశోధనా రంగంలో అవార్డు ఏర్పాటుకై, రాయగిరిలో తలపెట్టిన స్టేడియానికి కూడా ఆయన పేరు పెట్టాలని కోరారు. అందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు.