పదేళ్లలో కేటీఆర్ ఎన్ని కోట్ల పెట్టుబడులు తెచ్చారు? : ఎంపీ చామల

బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కేటీఆర్ విదేశాల్లో పర్యటించి ఎన్ని కోట్ల పెట్టుబడులు తెచ్చారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చామల మాట్లాడుతూ రాష్ట్రానికి పెట్టుబడుల కోసం సీఎం రేవంత్ రెడ్డి విదేశాలకు వెళ్తే దాన్ని కూడా వక్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లలో కేటీఆర్ ఎన్నిసార్లు విదేశాలకు వెళ్లారు? ఎన్ని కోట్ల పెట్టుబడులు తెచ్చారు? గత ప్రభుత్వం అధిక వడ్డీలకు అప్పులు తెచ్చింది. తక్కువ వడ్డీలకు అప్పులిచ్చే ప్రపంచ బ్యాంక్ వంటి వనరులను వాడుకోలేదు. రాష్ట్రాన్ని బీఆర్‌ఎస్ అప్పుల పాల్జేసింది. ఆ పార్టీ నేతలు ప్రజల్ని మాయమాటలు చెప్పి తప్పుదోవ పట్టిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే మమ్మల్ని తప్పుబడుతున్నారు. ఎలా బద్నాం చేయాలనే ఆలోచనతోనే ముందుకెళ్తున్నారు. పార్టీలతో సంబంధం లేకుండా తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు వచ్చే అందర్నీ ఆహ్వానిస్తున్నాం. గంజాయి, చీప్ లిక్కర్, డ్రగ్స్ మినహా అన్ని వ్యాపారాలకు అనుమతులు ఇస్తాం. ఉద్యోగాలు ఇవ్వడం, సంపద పెంచడమే మా లక్ష్యం అని అన్నారు.