MLC Balmuri Venkat: కేటీఆర్ విదేశాలకు పారిపోవచ్చు.. పాస్‌పోర్ట్ సీజ్ చెయ్యాలి: ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

ఫార్ములా ఈ రేస్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. విదేశాలకు పారిపోయే ప్రమాదం ఉందని, కాబట్టి ఆయన పాస్‌పోర్ట్‌ను వెంటనే సీజ్ చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ (MLC Balmuri Venkat) డిమాండ్ చేశారు. గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేటీఆర్ నిజంగానే ఎలాంటి తప్పు చేయకపోతే.. విచారణకు హాజరయ్యే సమయంలో న్యాయ నిపుణులు, లీగల్ టీమ్ ఎందుకని వెంకట్ నిలదీశారు. ఎలాంటి తప్పు చేయలేదని ఒకపక్క చెప్తున్న కేటీఆర్.. మరోపక్క ఏసీబీ విచారణకు మాత్రం ఎందుకు హాజరు కావడం లేదో చెప్పాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకున్న సొమ్మును ప్రజలకు పంచి పెట్టేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందన్న బల్మూరి వెంకట్ (MLC Balmuri Venkat).. దొంగలకు అండగా ఉండాలా? లేదంటే ప్రజల కోసం పని చేస్తున్న కాంగ్రెస్‌కు మద్దతిస్తారా? అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆలోచించుకోవాలని సలహా ఇచ్చారు. ప్రజల సొమ్మును కాజేసిన దొంగ కేటీఆర్ అని, తప్పు చేసిన వారిని కాంగ్రెస్ ప్రభుత్వం వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.