Harishrao-BRS: ఇది ఆరడుగుల బుల్లెట్… కాళేశ్వరంపై హరీశ్ స్పీచ్ అదిరిందన్న బీఆర్ఎస్…

కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleswaram Project) పై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదిక రాజకీయ ప్రేరేపితమని, అదో డొల్ల రిపోర్ట్ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు (Harish Rao) తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ నివేదిక న్యాయస్థానంలో నిలబడదని స్పష్టం చేశారు.అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన 660 పేజీల నివేదికపై చర్చించేందుకు కేవలం అరగంట సమయం ఇవ్వడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “ఇంత పెద్ద నివేదికపై అరగంటలో ఏం మాట్లాడగలం? ప్రజలకు వాస్తవాలు తెలియకుండా చేసే కుట్ర ఇది” అని ఆయన అన్నారు. ఇంత కీలకమైన అంశంపై మాట్లాడేందుకు కనీసం రెండు గంటల సమయం ఇవ్వాలని, ఎలాంటి అంతరాయం కలిగించవద్దని ఆయన డిమాండ్ చేశారు. అవసరమైతే రాబోయే రెండు రోజులు కూడా చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదిక చట్టబద్ధం కాదని, అది కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విచారణ కమిషన్ల చట్టం, 1952లోని సెక్షన్ 8బీ ప్రకారం తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, తమ వాదన వినే అవకాశం కల్పించకుండా ఏకపక్షంగా నివేదిక రూపొందించారని ఆయన ఆరోపించారు. ఈ ప్రక్రియ రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుందని, ఈ నివేదిక చెత్త కాగితంతో సమానమని ఆయన అభివర్ణించారు.
కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచే కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తోందని హరీశ్ రావు ఆరోపించారు. ప్రాజెక్టు పూర్తయితే కేసీఆర్‌కు, బీఆర్ఎస్‌కు మంచి పేరు వస్తుందనే దురుద్దేశంతోనే కాంగ్రెస్ నేతలు కోర్టుల్లో కేసులు వేసి భూసేకరణను అడ్డుకున్నారని అన్నారు. అధికారంలోకి వస్తే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలోనే పెట్టారని, ఇప్పుడు ఘోష్ కమిషన్‌ను ఏర్పాటు చేసి రాజకీయ కక్ష సాధింపునకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. విచారణ కమిషన్లను రాజకీయ అస్త్రంగా వాడుకోవద్దని 1958లోనే సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని గుర్తుచేశారు.
మరోవైపు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై ఆదివారం మాట్లాడిన మాజీ మంత్రి హరీశ్‌రావుకు మద్దతుగా భారత రాష్ట్రసమితి ఎక్స్‌లో పోస్టు చేసింది. ఇది ఆరడుగుల బుల్లెట్టు అంటూ ఎక్స్‌లో రాసుకొచ్చింది. సింహం సింగిల్‌గానే వస్తుందంటూ హరీశ్‌రావును ఉద్దేశించి భారత రాష్ట్ర సమితి పోస్టు చేసింది. కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రచారాన్ని ఆధారాలతో సహా తిప్పికొట్టారని పేర్కొంది.
ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో మాజీ సీఎం కేసీఆర్‌ను భారత రాష్ట్ర సమితి నేతలు కలిశారు. కేటీఆర్, ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు ఆయనతో సమావేశమయ్యారు. కాళేశ్వరం అంశాన్ని సీబీఐకి అప్పగిస్తామన్న ప్రభుత్వ ప్రకటనపై చర్చించినట్లు తెలుస్తోంది.