Telangana: పల్లె పోరుకు సై.. ఇంతలోనే ఎంత మార్పు?
తెలంగాణలో (Telangana) మరోసారి రాజకీయ వేడి రాజుకుంటోంది. నిన్న మొన్నటి వరకు వాయిదా పడుతూ వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలకు (Local body Elections) ఎట్టకేలకు మోక్షం లభించింది. రాష్ట్రంలోని పల్లెల్లో కొత్త పాలకవర్గాలను ఎన్నుకునేందుకు రంగం సిద్ధమైంది. నాలుగైదు రోజుల్లోనే పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. డిసెంబర్ మూడో వారం లోపే ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేసేలా రాష్ట్ర ఎన్నికల సంఘం, ప్రభుత్వం శరవేగంగా పావులు కదుపుతున్నాయి.
కొద్ది రోజుల క్రితం వరకు పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆచితూచి అడుగులేసింది. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ప్రధానంగా బీసీ రిజర్వేషన్ల పెంపుపై న్యాయపరమైన చిక్కులు వంటి కారణాలతో ఎన్నికలను వాయిదా వేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వం వెనుకంజ వేస్తోందంటూ విమర్శలు గుప్పించాయి. అయితే, ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది.
ఈ ఆకస్మిక మార్పుకు ప్రధాన కారణం ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘన విజయం ఆ పార్టీ కేడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. పట్టణ ప్రాంత ఓటర్లు, ముఖ్యంగా విద్యావంతులు, మధ్యతరగతి వర్గాలు కాంగ్రెస్ వైపు ఉన్నారనే సంకేతాలు ఇచ్చింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో తమకు మంచి పట్టు ఉందని ఇప్పటికే కాంగ్రెస్ నమ్ముతోంది. దీంతో ఎన్నికలు నిర్వహించేందుకు ఇదే సరైన సమయమని అధిష్టానం భావించింది. ఈ విజయంతో వచ్చిన ‘జోష్’ను పంచాయతీ ఎన్నికల్లోనూ కొనసాగించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించుకుంది.
పంచాయతీ ఎన్నికల్లో అతిపెద్ద సవాలు బీసీ రిజర్వేషన్లు. చట్టపరంగా ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లను దాటి వెళ్లడం కష్టసాధ్యం. అయితే, ఇక్కడే కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహాత్మక అస్త్రాన్ని ఎంచుకుంది. ఎన్నికల సంఘం ఖరారు చేసే అధికారిక రిజర్వేషన్లు ఎలా ఉన్నా, పార్టీ పరంగా బీసీలకు 42 శాతం టికెట్లు కేటాయించాలని నిర్ణయించింది. ప్రభుత్వ పరంగా అమలు చేసేందుకు వీలుకాకపోవడంతో, తమ బాధ్యతగా పార్టీపరంగా ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు సముచిత స్థానం కల్పించామని చెప్పుకోవడానికి, అదే సమయంలో ప్రతిపక్షాల నోరు మూయించడానికి ఈ నిర్ణయం దోహదపడుతుంది. రానున్న రెండు మూడు రోజుల్లో ఎన్నికల సంఘం జిల్లాల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేయనుంది. ఆ వెంటనే పార్టీ తన అభ్యర్థుల ఎంపికలో ఈ 42 శాతం ఫార్ములాను అమలు చేయనుంది.
పంచాయతీ ఎన్నికల అధికార యంత్రాంగం ప్రస్తుతం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. రాబోయే 2-3 రోజుల్లో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో రిజర్వేషన్ల జాబితా కొలిక్కి రానుంది. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే, మరో 4-5 రోజుల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. డిసెంబర్ మూడో వారం లోపు ఎన్నికలను ముగించి, కొత్త సర్పంచులు బాధ్యతలు స్వీకరించేలా షెడ్యూల్ రూపొందించారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గ్రామీణ స్థాయిలో పార్టీ క్యాడర్ను బలోపేతం చేసుకోవడానికి, గ్రామాల్లో పట్టు సాధించడానికి ఈ ఎన్నికలు కీలకం. సర్పంచులు అధికార పార్టీకి చెందిన వారైతే, సంక్షేమ పథకాల అమలు సులభమవుతుంది. ఇది ప్రభుత్వానికి సానుకూలతను పెంచుతుంది. జూబ్లీహిల్స్ ఓటమితో డీలా పడ్డ ప్రతిపక్షానికి కోలుకునే సమయం ఇవ్వకుండా, వెంటనే పంచాయతీ ఎన్నికలకు వెళ్లడం ద్వారా వారిని ఆత్మరక్షణలో పడేయాలన్నది కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది.






