Formula E Race Case: నేను ఎలాంటి తప్పు చెయ్యలేదు.. ఏ విచారణకైనా సిద్ధం: కేటీఆర్

ఫార్ములా ఈ-కార్ రేసు (Formula E Race Case) నిర్వహణలో అవకతవకలు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఎలాంటి విచారణలకైనా సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. భారత న్యాయస్థానాలు, న్యాయవ్యవస్థపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, అందుకే తనపై పెట్టిన కేసు కక్ష సాధింపు చర్య అని తెలిసినా ఏసీబీ విచారణకు హాజరయ్యానని చెప్పారు. తనపై పెట్టింది తప్పుడు కేసన్న (Formula E Race Case) ఆయన.. అవినీతిపరులకు పక్కవాళ్లు ఏం చేసినా అవినీతిగానే కనపడుతుందని విమర్శించారు. ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారంలో పైసా అవినీతి జరగలేదని స్పష్టం చేశారు. తెలంగాణ ఇమేజ్‌ను పెంచేందుకే పార్ములా ఈ-రేస్‌ను భాగ్యనగరంలో నిర్వహించామని చెప్పారు. రేవంత్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకొని తనపై కేసు పెట్టారని ఆరోపించారు. తను ఏసీబీ విచారణకు లాయర్‌తో కలిసి హాజరవుతానంటే వద్దంటున్నారని, హైకోర్టు అనుమతిస్తే లాయర్‌తో కలిసి ఏసీబీ విచారణకు హాజరవుతానని తెలిపారు. అవసరమైతే సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తామన్న ఆయన (KTR).. దుర్మార్గుల నుంచి చట్టపరంగా రక్షణ కోరుతున్నాని చెప్పారు. ఏసీబీ అధికారులు తన హక్కులకు భంగం కలిగేలా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు.