KTR: ఉప రాష్ట్రపతి ఎన్నికలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

భారత ఉప రాష్ట్రపతి ఎన్నికలపై భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు (KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి తరపున జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి, ఎన్డీఏ తరపున సి.పి. రాధాకృష్ణన్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న సందర్భంలో, బీఆర్ఎస్ తమ స్టాండ్ ఏంటో చెప్పేందుకు తగిన సమయం తీసుకుంటామని కేటీఆర్ ప్రకటించారు.తెలంగాణ ప్రజలే తమ బాస్‌లని, ఢిల్లీలో ఎవరి ప్రభావానికి లోనవబోమని స్పష్టం చేశారు.
“మాకు ఢిల్లీలో ఎవరూ బాస్‌లు కాదు. ప్రధాని నరేంద్ర మోడీ గానీ, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గానీ మాకు బాస్‌లు కాదు. తెలంగాణ ప్రజలే మా బాస్. వారి ఆకాంక్షలకు అనుగుణంగా మేము నిర్ణయాలు తీసుకుంటాం” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, సమయం ఉన్నందున పార్టీ నాయకులతో సమావేశమై చర్చించిన తర్వాత నిర్ణయం ప్రకటిస్తామని ఆయన తెలిపారు.
కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించిన కేటీఆర్, కాంగ్రెస్‌ను “థర్డ్ క్లాస్ పార్టీ”గా అభివర్ణించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మద్దతు ఇస్తున్న అభ్యర్థిని బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో సమర్థించబోదని ఆయన స్పష్టం చేశారు. “రేవంత్ రెడ్డి మద్దతు ఇస్తున్నాడంటే ఆ అభ్యర్థి ఏ పార్టీకి చెందినవాడో అర్థమవుతోంది. అలాంటి అభ్యర్థిని మేము సపోర్ట్ చేయబోము” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, కాంగ్రెస్ బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేదని ప్రశ్నించారు. “కంచె ఐలయ్య వంటి వ్యక్తిని అభ్యర్థిగా పెట్టవచ్చు కదా? కాంగ్రెస్ ఎందుకు బీసీ అభ్యర్థిని ఎంచుకోలేదు?” అని ఆయన నిలదీశారు.
బీఆర్ఎస్‌కు రాజ్యసభలో నలుగురు సభ్యులు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఎన్డీఏ లేదా ఇండియా కూటమి నుంచి తమను ఎవరూ సంప్రదించలేదని కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే నిర్ణయం ఉంటుందన్నారు. “సెప్టెంబర్ 9 వరకు 2 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను తెలంగాణకు ఎవరు సమకూర్చగలరో, వారికి మా మద్దతు ఇవ్వడం గురించి ఆలోచిస్తాం” అని ఆయన కేటీఆర్ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్, బీజేపీలపై కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ రెండు పార్టీలూ తెలంగాణ కోసం ఏమీ చేయలేదన్నరు. ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్‌తో ఈ రెండు నడుస్తున్నాయన్నారు. బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతినిధిగా నిలుస్తుందని, రాష్ట్ర సంక్షేమం కోసం పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు.