KTR: కాంగ్రెస్‌కు పరిపాలన చేతకాదు.. దేశాన్ని త్వరలో కేసీఆర్ శాసిస్తారు: కేటీఆర్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పందించారు. గెలుస్తామనే అతి విశ్వాసం, చిన్న చిన్న తప్పిదాల వల్లే తాము ఓడిపోయామని చెప్పిన కేటీఆర్.. త్వరలోనే దేశాన్ని కేసీఆర్ శాసించే రోజులు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా కూడా కాంగ్రెస్ నేతలు ఇంకా కేసీఆర్ పేరే జపిస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌కు పరిపాలన చేయడం చేతకావట్లేదని విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతినడం గురించి మాట్లాడిన ఆయన.. దెబ్బతిన్నది మేడిగడ్డ బ్యారేజీ కాదని, రేవంత్ రెడ్డి బుర్ర అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సిరిసిల్లలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ (KTR) ఈ వ్యాఖ్యలు చేశారు.
అలాగే కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్లో ఇప్పటి వరకు అర (సగం) గ్యారంటీ మాత్రమే అమలు అయిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ చెప్తున్నట్లు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ నూటికి నూరు శాతం అమలైందని నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని, అసెంబ్లీ సాక్షిగా ఈ విషయం చెప్పానని మరోసారి కేటీఆర్ (KTR) గుర్తుచేశారు.