KTR : అష్టదిగ్బంధనంలో కేటీఆర్..! అన్ని దారులూ మూసుకుపోయాయా..?

ఫార్ములా ఈ-రేస్ కేసు (Formula E-Race Case) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మెడకు గట్టిగానే చుట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో ఆయన్ను అరెస్టు చేసేందుకు ఏసీబీ (ACB) అన్ని ఏర్పాట్లూ సిద్ధం చేసుకుంటోంది. మరోవైపు.. ఈ కేసు నుంచి బయట పడేందుకు కేటీఆర్ (KTR) తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే కేటీఆర్ చుట్టూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం (Revanth Reddy Govt) అష్టదిగ్బంధనం చేసినట్లు అర్థమవుతోంది. దీంతో ఒకవేళ ఆయన అరెస్ట్ అయితే బెయిల్ (bail) పై వెంటనే బయటకు రావడం కూడా కష్టమే. దీంతో బీఆర్ఎస్ (BRS) శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.
ఫార్ములా ఈ-రేస్ కేసు ఒక లొట్టపీసు కేసని కేటీఆర్ అభివర్ణించారు. దీని నుంచి స్వచ్ఛంగా బయటకు వస్తానని ఆయన పార్టీ శ్రేణులకు ధీమాగా చెప్తున్నారు. ఇది లొట్టపీస్ కేసు అయితే ఎందుకు విచారణకు హాజరు కావట్లేదని కాంగ్రెస్ (Congress) ప్రశ్నిస్తోంది. ఏసీబీ ఇప్పటికే కేటీఆర్ ను విచారణకు (enquiry) పిలిచింది. అయితే లాయర్ ను అనుమతిస్తేనే తాను హాజరవుతానంటూ కేటీఆర్ వెనుదిరిగి వచ్చేశారు. ఇంతలో ఈ కేసును కొట్టేయాలంటూ హైకోర్టులో కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ ను ధర్మాసనం కొట్టేసింది. ఇది కేటీఆర్ కు గట్టి ఎదురుదెబ్బ. హైకోర్టు (High court) ఈ పిటిషన్ ను కొట్టేయగానే ఏసీబీ రంగంలోకి దిగింది. 9న విచారణకు రావాలంటూ మళ్లీ నోటీసులు ఇచ్చింది. అయితే ఈ కేసును కొట్టేయాలంటూ సుప్రీంకోర్టులో (Supreme court) క్వాష్ పిటిషన్ (quash petition) దాఖలు చేసేందుకు కేటీఆర్ సిద్ధమవుతున్నట్టు సమాచారం.
9న ఏసీబీ విచారణకు హాజరు కావాల్సి ఉండడంతో హైకోర్టులో కేటీఆర్ మరో పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు లాయర్ ను అనుమతించేలా ఏసీబీని ఆదేశించాలనేది ఈ లంచ్ మోషన్ పిటిషన్ (lunch motion petition) సారాంశం. అయితే కేటీఆర్ తో పాటు లాయర్లు (advocates) కూర్చునేందుకు హైకోర్టు అనుమతించలేదు. వాళ్లు దూరంగా ఉండేందుకు అవకాశం కల్పించినట్లు సమాచారం. మరోవైపు ఈ ఇష్యూపై కేటీఆర్ ను అరెస్టు చేసేందుకు ఏసీబీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. కేటీఆర్ ను అరెస్టు చేస్తే తగిన భద్రత కల్పించాల్సిందిగా బంజారాహిల్స్ పోలీసులను ఏసీబీ కోరినట్లు సమాచారం. ఈ కేసులో సహ నిందితులుగా ఉన్న అర్వింద్ కుమార్ (Arvind Kumar), బీఎల్ఎన్ రెడ్డిలను (BLN Reddy) ఏసీబీ మరోసారి విచారణకు పిలిచింది. ఇందులో అర్వింద్ కుమార్ అప్రూవర్ గా మారేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.
ఒకవేళ అర్వింద్ కుమార్ అప్రూవర్ గా మారితే కేటీఆర్ ను అరెస్టు చేయడం ఏసీబీకి తేలిక. అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ కోసం కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించవచ్చు. అయితే సహజంగా బెయిల్ పిటిషన్లను కిందికోర్టులో తేల్చుకోవాలని హైకోర్టు సూచిస్తూ ఉంటుంది. అప్పుడు కేటీఆర్ ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సహజంగానే ఏసీబీ కోర్టు బెయిల్ వ్యతిరేకిస్తుంటుంది. అప్పుడాయన మళ్లీ హైకోర్టు, సుప్రీంకోర్టు వరకూ వెళ్లాల్సి ఉంటుంది. ఇందుకు చాలా సమయం పట్టొచ్చు. జైలులోనే గడపాల్సి రావచ్చు. ఈలోపు ఈడీ (ED) కూడా ఈ కేసులో మరింత ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. దీంతో ఈ కేసులో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యూహాత్మకంగా కేటీఆర్ ను అష్టదిగ్బంధనం చేసినట్లు అర్థమవుతోంది.