KCR: కష్టాల్లో కేసీఆర్..! బీజేపీని ఆశ్రయించక తప్పదా..?

కేసీఆర్.. ఈ మూడక్షరాలు ఓ ప్రభంజనం. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వ్యక్తిగా ఆయన నిలిచారు. ప్రత్యేక తెలంగాణ (Telangana State) అయ్యేపని కాదని అందరూ చేతులెత్తేసిన సమయంలో ఆ ఉద్యమాన్ని ముందుండి నడిపించారు కేసీఆర్ (KCR). అంతేకాదు.. ప్రత్యేక రాష్ట్రాన్ని సాకారం చేసి చూపించారు. అందుకు కృతజ్ఞతగా కేసీఆర్ కు పదేళ్లపాటు అధికారం ఇచ్చారు తెలంగాణ ప్రజలు. ఆ తర్వాత ప్రతిపక్షానికి పరిమితం చేశారు. అప్పటి నుంచి కేసీఆర్ కు కష్టాలు మొదలయ్యాయి. కుమార్తె కవిత (Kavitha Kalvakuntla) ఢిల్లీ లిక్కర్ కేసులో (Delhi Liquor Scam) అరెస్ట్ అయి జైలుకెళ్లారు. ఇప్పుడు కుమారుడు కేటీఆర్ అరెస్టు (KTR Arrest) ముంగిట ఉన్నారు. ఓ వైపు పార్టీ ఓటమి, మరోవైపు వారసుల అరెస్టులు కేసీఆర్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
దేశ రాజకీయాల్లో కేసీఆర్ ఓ వెలుగు వెలిగారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ పితగా ఆయన పేరొందారు. తెలంగాణలో పదేళ్లపాటు తాను అమలు చేసిన సంస్కరణలు దేశానికే ఆదర్శం అని భావించిన కేసీఆర్.. దేశమంతా వీటిని అమలు చేయాలని సంకల్పించారు. అందుకే టీఆర్ఎస్ (TRS) పేరును బీఆర్ఎస్ (BRS) గా మార్చి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్నారు. అయితే ఆయన ఆశలు నెరవేరలేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి చెందింది. దీంతో 2024 లోక్ సభ ఎన్నికల్లో అన్ని రాష్ట్రాల్లో పోటీ చేయాలనుకున్న ఆయన ఆశలు గల్లంతయ్యాయి. దీంతో రాష్ట్రానికే పరిమితమైపోయారు.
ఇంతలో ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో కుమార్తె కవిత అరెస్ట్ అయ్యారు. ఆవిడను సీబీఐ అరెస్టు చేసి జైలుకు పంపించింది. దాదాపు 150 రోజుల పాటు ఆమె జైలు జీవితం గడిపారు. ఇప్పుడామె బెయిల్ పై ఉన్నారు. ఇంతలో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఫార్ముల్ ఈ-కేసులో (Formula E-Race case) కేటీఆర్ ను అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ సాగుతోంది. రేపోమాపో కేటీఆర్ అరెస్ట్ కావడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే కేసీఆర్ కు కోలుకోలేని దెబ్బ.
కేసీఆర్ మంచి వ్యూహకర్తగా పేరొందారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన పూర్తిగా ఫాంహౌస్ కే పరిమితమయ్యారు. ప్రతిపక్షనేత హోదా (Opposition Leader) ఉన్నా కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావట్లేదు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనట్లేదు. పార్టీని పూర్తిగా కుమారుడు కేటీఆర్ చేతుల్లో పెట్టేసినట్లు అర్థమవుతోంది. ఇప్పుడు కేటీఆర్ కూడా జైలుకెళ్తే నడిపించే నాయకుడెవరనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఓ వైపు పార్టీ ఓటమి, మరోవైపు పిల్లల అరెస్టులు కేసీఆర్ కు కచ్చితంగా క్షోభ కలిగించేవే..! పరిస్థితులు ఇలాగే కొనసాగితే పార్టీ మనుగడ సాగించడం కష్టం. వీటి నుంచి బయట పడాలంటే కచ్చితంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ (BJP) అండ అవసరమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఢిల్లీ ఎన్నికల్లో (Delhi Elections) ఆప్ (AAP) ఓడిపోతే బీజేపీ మరింత దూకుడు ప్రదర్శించే అవకాశం ఉంటుంది. అప్పుడు కచ్చితంగా కేసీఆర్ బీజేపీ శరణుకోరే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో..!!