Kavitha: కవితపై సస్పెన్షన్ వేటు… కేసీఆర్ సెన్సేషన్..!

ఊహించినట్లే జరిగింది. ఎమ్మెల్సీ కవితను (MLC Kavitha) పార్టీ నుంచి సస్పెండ్ చేసింది బీఆర్ఎస్ (BRS). కొంతకాలంగా పార్టీపైన, పార్టీలోని కొంతమంది నేతలపైన తీవ్ర అసంతృప్తితో ఉన్న కవిత, పలు సంచలన ఆరోపణలు చేసింది. తాజాగా కేసీఆర్ పై అవినీత మరక అంటడానికి హరీశ్ రావు (Harish Rao), సంతోశ్ రావే (Santhosh Rao) కారణమంటూ బాంబ్ పేల్చింది. అంతేకాక పార్టీ ఉంటే ఎంత.. పోతే ఎంత.. అని ఆమె చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. ఇంకా ఉపేక్షించడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో (Delhi Liquor Scam) కవితపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆమె జైలుకు కూడా వెళ్లారు. అప్పటి నుంచి ఆమెను పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంచారు కేసీఆర్. దీన్ని ఆమె జీర్ణించుకోలేకపోయారు. పార్టీలోనే ఉంటూ తన సొంత కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా ఆమెకు స్థానం లేకపోవడంతో తట్టుకోలేకపోయారు. మే నెలలో శంషాబాద్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన ఆమె పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు.
రజతోత్సవ సభ ముగిసిన తర్వాత తాను తండ్రి కేసీఆర్ కు రాసిన లేఖను ఎవరు లీక్ చేశారో బయట పెట్టాలని కవిత డిమాండ్ చేశారు. పార్టీలో కేసీఆర్ చుట్టూ కొందరు దయ్యాలున్నారని ఆమె ఆరోపించారు. తాను జైల్లో ఉన్నప్పుడు బీజేపీలో పార్టీని విలీనం చేయాలని ప్రతిపాదించారని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను పార్టీ సీరియస్ గా తీసుకుంది. అంతకంటే ముందుగా తల్లి ద్వారా కవితకు చెప్పి చూశారు కేసీఆర్. ఇకపై నోరు జారొద్దని హెచ్చరించారు. మరోవైపు సోదరుడు కేటీఆర్ కూడా ఎవరూ పార్టీ లైన్ దాటొద్దని పరోక్షంగా హెచ్చరించారు. అయినా కవిత వెనక్కు తగ్గలేదు.
కవిత వ్యవహార శైలిపై మూడు నెలలుగా కేసీఆర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అయితే కుమార్తె కావడంతో నిగ్రహించుకుంటున్నారు. పీసీ ఘోష్ కమిషన్ ముందు కేసీఆర్ హాజరైన సమయంలో కూడా కవిత అక్కడికి వెళ్లారు. అయితే కేసీఆర్ పట్టించుకోలేదు. పార్టీ శ్రేణులు కూడా కవితకు దూరంగా ఉంటున్నాయి. అదే సమయంలో కవిత మరింత రెచ్చిపోయారు. జగదశ్ రెడ్డిపై పరోక్ష విమర్శలు గుప్పించారు. అయితే పార్టీ జగదీశ్ రెడ్డికి అండగా నిలబడింది.
తాజాగా కాళేశ్వరం అంశంపై సీబీఐ విచారణకు రేవంత్ రెడ్డి సర్కార్ ఆదేశించిన నేపథ్యంలో కవిత ప్రెస్ మీట్ పెట్టారు. కేసీఆర్ కు అవినీతి మరక అంటడానికి హరీష్ రావు, సంతోష్ రావే కారణమని ఆరోపించారు. వీటిని పార్టీ సీరియస్ గా తీసుకుంది. రోజంతా ఈ అంశంపై ఫాంహౌస్ లో పార్టీ నేతలతో చర్చలు జరిపారు కేసీఆర్. హరీశ్ రావుకు అండగా నిలబడుతూ కేటీఆర్ ట్వీట్ చేశారు. కవితను ఉపేక్షిస్తే పార్టీ చేతగానితనంగా భావించే అవకాశం ఉందని పలువురు నేతలు అభిప్రాయపడినట్లు సమాచారం. అందుకే కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.