Kavitha: కవిత బీఆర్ఎస్‌కు మేలు చేసిందా..? కీడు చేసిందా..?

బీఆర్ఎస్ (BRS) పార్టీలో అంతర్గత సంక్షోభం తారస్థాయికి చేరింది. కవితను (Kavitha) పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కేసీఆర్. దీనిపై కవిత కూడా ఘాటుగానే స్పందించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ పదవికి కూడా ఆమె రాజీనామా (resignation) చేశారు. దీంతో తను నిజాయితీ పరురాలినని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. తన కుటుంబసభ్యులపై ఆమె ఎంతో జాగ్రత్తగా మాట్లాడారు. తండ్రికి, సోదరుడికి తనదైన స్టైల్ లో జాగ్రత్తలు చెప్పారు. అదే సమయంలో పార్టీని మరింత ఇరకాటంలోకి నెట్టేశారు. ఇదిప్పుడు పార్టీని కలవరపెట్టడం ఖాయం. ఇంతకు ముందు లాగా పార్టీలో ఆల్ ఈజ్ వెల్ అని చెప్పుకునే పరిస్థితి ఇకపై ఉండకపోవచ్చు.
బీఆర్ఎస్ లో హరీశ్ రావు (Harish Rao), సంతోశ్ రావు (Santosh Rao) మేకవన్నె పులులు అని కవిత ఆరోపించారు. వాళ్లిద్దరి వల్లే పార్టీ నాశనమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తన సోదరుడు కేటీఆర్ (KTR) కు గడ్డం పట్టుకుని మరీ నచ్చజెప్పానని, అయినా తన మాట పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబసభ్యురాలిగా కాకపోయినా ఎమ్మెల్సీగా తనకు అన్యాయం జరుగుతోందని చెప్పినా కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న కేటీఆర్ స్పందించకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవలని కవిత ప్రశ్నించారు. పార్టీపై తనకు కోపం లేదని, పార్టీ ఆవిర్భావం నుంచి తండ్రికి అండగా ఉండాలనే ఉద్దేశంతోనే తాను కొనసాగానని కవిత తేల్చి చెప్పారు. తనకు పదవులు ముఖ్యం కాదని, అందుకే ఎమ్మెల్సీ పదవిని కూడా వదులుకుంటున్నట్టు చెప్పారు.
అదే సమయంలో కేసీఆర్ (KCR) కు అవినీతి మరక అంటడానికి హరీశ్ రావు, సంతోశ్ రావు ధనదాహమే కారణమన్నారు. హరీశ్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడే కాళేశ్వరం (Kaleswaram) కుంభకోణం జరిగిందన్నారు. కాంట్రాక్టర్లతో కలిసి కుట్రలు చేసి కోట్లు దోచుకున్నారని కవిత ఆరోపించారు. మరోవైపు సంతోశ్ రావు కూడా పార్టీని అడ్డం పెట్టుకుని భారీగా లబ్ది పొందారని ఆమె అన్నారు. స్నేహితుడు పోచంపల్లి శ్రీనివాస రెడ్డితో కలిసి మోకిలాలో భారీ వెంచర్ వేశారన్నారు. గ్రీన్ ఛాలెంజ్ పేరుతో సినిమావాళ్లను, సెలబ్రిటీలను ఆకట్టుకోవడం వెనుక పెద్ద మోసం ఉందన్నారు. ఇలాంటి వాటన్నిటికి వాళ్లకు డబ్బు ఎలా వచ్చిందని ఆమె ప్రశ్నించారు. లబ్ది పొందింది వాళ్లయితే ఇప్పుడు అనుభవిస్తున్నది కేసీఆర్ అని ఆమే ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్, కేటీఆర్ లను ఒకవైపు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూనే, కవిత వాళ్లను మరిన్ని ఇబ్బందుల్లోకి నెట్టేశారు. ఇన్నాళ్లూ కాళేశ్వరంలో అవినీతే జరగలేదని పార్టీ చెప్తోంది. కానీ ఇప్పుడు కవిత మాత్రం అవినీతి జరిగిందని, దానికి పాల్పడింది హరీశ్ రావేనని తేల్చేశారు. ఇది పార్టీ వాదనలకు విరుద్ధంగా ఉంది. ఇప్పుడు ఈ అంశంపై మరిన్ని విమర్శలను పార్టీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ సొంతింటి బిడ్డే అవినీతి సర్టిఫికెట్ ఇచ్చిందని కాంగ్రెస్, బీజేపీ వాళ్లు విమర్శించేందుకు ఆస్కారం ఏర్పడింది. ఈ కోణంలో పార్టీని కవిత మరిన్ని ఇబ్బందుల్లోకి నెట్టినట్లే కనిపిస్తోంది.