Kadiyam Srihari: కడియం శ్రీహరి దారెటు..?
తెలంగాణ రాజకీయాలన్నీ ఇప్పుడు ఫిరాయింపుల అంశం చుట్టూనే తిరుగుతున్నాయి. ముఖ్యంగా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే, సీనియర్ నేత కడియం శ్రీహరి (Kadiyam Srihari) చుట్టూ జరుగుతున్న పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఒకవైపు బీఆర్ఎస్ అనర్హత వేటు కోసం పట్టుబడుతుండగా, మరోవైపు తాను రాజీనామా చేసేది లేదని, స్పీకర్ నిర్ణయం మేరకే నడుచుకుంటానని కడియం స్పష్టం చేయడం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువు సమీపిస్తుండటంతో, రాబోయే కొద్ది రోజుల్లో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి కడియం శ్రీహరి విజయం సాధించారు. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న కడియం, బీఆర్ఎస్లో కీలక నేతగా వ్యవహరించారు. అయితే, పార్లమెంట్ ఎన్నికల సమయానికి రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోయాయి. తన కుమార్తె కడియం కావ్యకు ఎంపీ టికెట్ విషయం, పార్టీ అంతర్గత వ్యవహారాల నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.కేవలం పార్టీ మారడమే కాకుండా, వరంగల్ ఎంపీగా కాంగ్రెస్ తరపున పోటీ చేసిన తన కుమార్తె కావ్య గెలుపు కోసం ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి, మరో పార్టీలో చేరి, ఆ పార్టీ కోసం బహిరంగంగా ప్రచారం చేయడం ఫిరాయింపుల నిరోధక చట్టం (Anti-Defection Law) కింద తీవ్రమైన ఉల్లంఘన అని బీఆర్ఎస్ వాదిస్తోంది. ఈ మేరకు స్పీకర్‌కు అనర్హత పిటిషన్‌ను కూడా సమర్పించింది.
గతంలో పార్టీ ఫిరాయింపులపై స్పీకర్లు నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేసేవారు. ఏళ్ల తరబడి పిటిషన్లు పెండింగ్‌లో ఉండేవి. కానీ, ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో, నిర్ణీత గడువులోగా స్పీకర్ తన నిర్ణయాన్ని వెల్లడించాల్సి ఉంది. ఈ గడువు దగ్గర పడుతుండటంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
తాజాగా కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యూహాన్నికళ్లకు కడుతున్నాయి. “నేను రాజీనామా చేయను. స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాతే నా తదుపరి కార్యాచరణ ఉంటుంది” అని ఆయన స్పష్టం చేశారు. దీని వెనుక రెండు ప్రధాన కారణాలు విశ్లేషకులు భావిస్తున్నారు. స్పీకర్‌ను కలిసి వివరణ ఇచ్చేందుకు ఆయన మరికొంత సమయం కోరారు. ఇది న్యాయపరంగా తన వాదన వినిపించడానికి సమయం తీసుకోవడమే కాకుండా, రాజకీయంగా ఉప ఎన్నికను సాధ్యమైనంత వరకు ఆలస్యం చేసే ఎత్తుగడగా కనిపిస్తోంది. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం వేరు, లెజిస్లేచర్ పార్టీలో విలీనం కావడం వేరు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఫిరాయింపులను ‘బీఆర్ఎస్ ఎల్పీ (BRSLP) కాంగ్రెస్‌లో విలీనం’ అనే కోణంలో చూపే ప్రయత్నం చేయవచ్చని, తద్వారా అనర్హత వేటు నుంచి తప్పించుకోవచ్చని ఒక ప్రచారం ఉంది. అందుకే కడియం శ్రీహరిపై వేటు పడే అవకాశాలు తక్కువని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఒకవేళ స్పీకర్ అనర్హత వేటు వేస్తే, స్టేషన్ ఘన్‌పూర్‌తో పాటు ఇతర ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు అనివార్యమవుతాయి.
అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు ఇది సవాలుతో కూడిన అవకాశమే. ఉప ఎన్నికల్లో గెలిస్తే వారి బలం మరింత పెరుగుతుంది. కానీ, ప్రభుత వ్యతిరేకత ఏమైనా ఉంటే అది ఇబ్బందికరం. పార్టీని వీడిన వారిపై వేటు పడటం బీఆర్ఎస్కు నైతిక విజయమే అవుతుంది. ఉప ఎన్నికల్లో సత్తా చాటడానికి ఆ పార్టీ ప్రయత్నిస్తుంది. ఒకవేళ అనర్హత వేటు పడితే, ఆరేళ్ల వరకూ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత ఉండదు. తన కుమార్తె ఎంపీగా ఉన్నప్పటికీ, అసెంబ్లీ స్థానంలో తన పట్టు నిలుపుకోవడం ఆయనకు అత్యవసరం.
ప్రస్తుతానికి బంతి స్పీకర్ కోర్టులో ఉంది. సుప్రీంకోర్టు గడువు, బీఆర్ఎస్ ఒత్తిడి, కాంగ్రెస్ రాజకీయ అవసరాల మధ్య స్పీకర్ తీసుకునే నిర్ణయం తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పనుంది. కడియం శ్రీహరి ధీమా చూస్తుంటే, న్యాయపరమైన లొసుగులతోనో లేదా రాజకీయ సమీకరణాలతోనో తన పదవిని కాపాడుకోవచ్చని భావిస్తున్నట్లు అర్థమవుతోంది. రానున్న రోజుల్లో ఈ ఉత్కంఠకు తెరపడనుంది.






