MLC Kavitha : కేసీఆర్ జనం కోసం పని చేస్తే.. వాళ్లు ఆస్తుల పెంపుకోసం : కవిత సంచలన వ్యాఖ్యలు
కేసీఆర్ (KCR) పక్కనున్న కొందరు చేసిన పని వల్లే ఆయనకు చెడ్డపేరు వచ్చిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఐదేళ్లపాటు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న హరీశ్‌రావు పాత్ర లేదా? అని ప్రశ్నించారు. మాజీ ఎంపీ సంతోష్, హరీశ్‌రావు (Harish Rao) , మేఘా ఇంజినీరింగ్ (Megha Engineering) వల్లే కేసీఆర్‌కు చెడ్డపేరు వచ్చిందన్నారు. కాళేశ్వరంలో చిన్నభాగం కుంగితే మొత్తం ప్రాజెక్టు పోయినట్లు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ జనం కోసం పని చేస్తే, వాళ్లు ఆస్తుల పెంపుకోసం పనిచేశారు. హరీశ్‌రావు, సంతోష్ (Santosh) నాపై ఎన్నో సార్లు కుట్రలు చేశారు. అయినా నేను నోరు మెదపలేదు. ఈ రోజు కేసీఆర్ బిడ్డగా నేను ఎంతో బాధపడుతున్నా. హరీశ్‌రావు, సంతోష్ వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారు. వారి మధ్య లోపాయకారి ఒప్పందం కుదిరింది. హరీశ్‌రావు, సంతోష్‌ను రేవంత్ రెడ్డి ఏమీ అనరు. నా తండ్రిపైనే బాణం వేస్తారు. కేసీఆర్ మీద సీబీఐ (CBI ) దర్యాప్తు వేశాక పార్టీ ఉంటే ఏమిటి? లేకపోతే ఏమిటి? ఇది నా తండ్రి పరువునకు సంబంధించింది. నా లేఖ బయటకు వచ్చినా నేను ఎవరి పేర్లు బయటపెట్టలేదు. రేవంత్ రెడ్డి ప్రిప్లాన్‌డ్‌గా సీబీఐ పేరు చెప్పారు అని అన్నారు.







