హైదరాబాద్ లో అమెరికా ఎడ్యుకేషన్ ఫెయిర్

హైదరాబాద్ నగరంలోని హోటల్ ఐటీసీ కోహినూర్ లో ఈ నెల 16న యూఎస్‌ఏ ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహించనున్నట్లు హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ ఒక ప్రకటనలో తెలిపింది. సాయంత్రం 4:30 నుంచి రాత్రి 9:30 గంటల వరకు జరిగే కార్యక్రమంలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్, డాక్టరేట్ ప్రోగ్రామ్‌లలో చేరాలనుకునే విద్యార్థులు అందుకు సంబంధించిన సమగ్ర సమాచారం పొందవచ్చు. అమెరికాలోని 80 అక్రిడేటెడ్ విశ్వవిద్యాలయాలు, కాలేజీలకు చెందిన ప్రతినిధులతో పాటు ఎడ్యుకేషనల్ యూఎస్‌ఏ సలహాదారులు, అమెరికా రాయబార కార్యాలయ అధికారులు హాజరవుతారు. విద్యార్థులకు అవసరమైన సమచారాన్ని వీరు అందజేస్తారు. అమెరికా విద్యార్థి వీసా దరఖాస్తుల ప్రక్రియను కూడా తెలుసుకోవచ్చు. హైదరాబాద్ తరువాత 17న చెన్నైలో, 18న బెంగళూరులో, 19న కోల్‌కతా, 21న అహ్మదాబాద్, 22న పుణె, 24న ముంబయి, 25న ఢిల్లీలో ఎడ్యుకేషన్ ఫెయిర్లు ఏర్పాటు చేయనున్నారు. వీటిల్లో పాల్గొనే వారు ముందుగా ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవాలని, అందుకు https://bit.ly/EdUSAFair24Emb ను సందర్శించాలని వివరించింది.