ఫార్మాసిటీ….తెలంగాణకే తలమానికం
వేగంగా ప్రారంభానికి చర్యలు…పెట్టుబడులు పెడుతున్న ప్రముఖ కంపెనీలు
ఔషధ రంగంలో హైదరాబాద్ నగరానికి ప్రత్యేక స్థానం ఉన్నది. దేశీయ ఔషధ ఉత్పత్తుల్లో మూడో వంతు తెలంగాణ రాష్ట్రం నుంచే ఉన్నందున హైదరాబాద్ నగరానికి ఫార్మా క్యాపిటల్‌గా ఖ్యాతి లభించింది. నగరంలో దాదాపు 300 ఫార్మా కంపెనీలు ఔషధాలను తయారు చేస్తున్నాయి. ఇందులో చాలా కంపెనీలు యూఎస్ఎఫ్డీఏ గుర్తింపు పొంది అమెరికా, ఐరోపా దేశాలతోపాటు ఇతర అభివృద్ధి చెందిన దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఫార్మా రంగంలో మరింత అభివృద్ధిని సాధించాలనే లక్ష్యంతో పర్యావరణ హిత పరిశ్రమలను నెలకొల్పడానికి అంతర్జాతీయ స్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో ముచ్చెర్ల ఫార్మాసిటీని రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నది.
రంగారెడ్డి జిల్లా ముచ్చెర్లలో వేలాది ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ ఫార్మాసిటీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఔషధ, పరిశోధన సంస్థలకు సంబంధించి ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన ఎకోసిస్టంను ఇక్కడ అభివృద్ధి చేస్తున్నారు. మొదటి దశలో భాగంగా ఇప్పటికే 9,212 ఎకరాల భూమిని సేకరించగా, 6,719 ఎకరాల్లో రోడ్ల నిర్మాణం, విద్యుత్ లైన్ల ఏర్పాటు, డ్రైనేజీ తదితర మౌలిక సదుపాయాల కల్పన పనులు పూర్తయ్యాయి. మిగిలిన భూముల సేకరణ వివిధ దశల్లో ఉండగా, భూ సేకరణకు సంబంధించి గ్రామసభల నిర్వహణ ప్రక్రియ కూడా ముగిసింది. కేంద్రం ఇదివరకే ఈ ఫార్మాసిటీని నేషనల్ ఇండస్ట్రియల్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్జ్)గా గుర్తించింది. పర్యావరణ అనుమతులు సైతం మంజూరయ్యాయి. స్థలాల కేటాయింపు కోరుతూ 200లకుపైగా ఔషధ, పరిశోధన సంస్థలు టీఎస్ఐఐసీకి దరఖాస్తు కూడా చేసుకున్నాయి. నిమ్జ్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే మన రాష్ట్రం ప్రపంచ ఔషధ హబ్‌గా మారుతుందనడంలో సందేహం లేదని అధికారులు పేర్కొంటున్నారు.
ఫార్మాసిటీ మొత్తం విస్తీర్ణం 18,304 ఎకరాలు, మొదటి దశలో అందుబాటులోకి 9,212 ఎకరాలు, పెట్టుబడుల అంచనా 64,000 కోట్లు, వార్షిక ఎగుమతులు 58,000 కోట్లకు అవకాశం, ఉపాధి-ఉద్యోగావకాశాలు 5.60 లక్షలు
ఫార్మా సిటీపై 450 కంపెనీల ఆసక్తి
అన్ని మౌలిక వసతులతో నిర్మించే ఫార్మా సిటీ కోసం ఫార్మా కంపెనీలు ముఖ్యంగా బల్క్ డ్రగ్స్ కంపెనీలు ఆసక్తితో ఎదురు చూస్తున్నాయి. చైనా కంటే చౌకగా ఫార్మా సిటీలో యాక్టివ్ ఫార్మా ఇన్‌గ్రిడియెంట్స్ (ఏపీఐ)గా పిలిచే బల్క్ డ్రగ్స్ పెద్ద ఎత్తున అంతర్జాతీయ ప్రమాణాలతో ఉత్పత్తి చేయవచ్చని పరిశ్రమ వర్గాల అంచనా. సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, జైడస్ వంటి హేమాహేమీ కంపెనీలు ఇప్పటికే ఫార్మా సిటీలో తమ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయి.
విదేశీ కంపెనీలతో ఒప్పందాలు
కేటీఆర్ అమెరికా పర్యటన సమయంలో పలు ఫార్మా సిటీలు తమ పెట్టుబడులను ఫార్మాసిటీలో పెట్టనున్నట్లు ప్రకటించాయి. దీనికి సంబంధించి ఒప్పందాలను కూడా తెలంగాణ ప్రభుత్వం కుదుర్చుకుంది. ఇటీవల లండన్ పర్యటనలో కూడా ఫార్మాసిటీలో పెట్టుబడులు పెట్టేందుకు కొన్ని కంపెనీలు ముందుకు వచ్చాయి. దీంతో అంతర్జాతీయ కంపెనీలు ఇప్పటికే ఫార్మాసిటీపై దృష్టిని పెట్టాయి. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టెందుకు ముందుకు వస్తున్నాయి.
బల్క్ డ్రగ్స్ తయారీలో కాలుష్య పదార్ధాలు ఎక్కువగా వెలువడుతుంటాయి. వీటి నియంత్రణలో ఏమాత్రం విఫలమైనా పరిసర ప్రాంతాలు నివాస యోగ్యం కాకుండా పోతాయి. అందుకే ఈ ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చేటప్పుడే అధికారులు సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ) ఏర్పాటు వంటి కఠిన ఆంక్షలు విధిస్తుంటారు. పెద్ద పెద్ద కంపెనీలకు ఇది పెద్ద కష్టం కాదు. చిన్నచిన్న కంపెనీలకు మాత్రం ఇది తలకు మించిన భారమే. ఈ సమస్యలకు చెక్ పెట్టేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాలో 19,000 ఎకరాల్లో ఫార్మాసిటీ తలపెట్టింది. కామన్ ఎస్టీపీలు, సమస్త మౌలిక వసతుల కల్పన, త్వరగా అనుమతుల మంజూరు ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఫార్మా సిటీలో బల్క్ డ్రగ్స్ ఉత్పత్తి వ్యయం 25 నుంచి 30 శాతం తగ్గుతుందని అంచనా. దీంతో ఫార్మా సిటీలో తమ యూనిట్లు పెట్టేందుకు దేశ, విదేశాలకు చెందిన 450 ఫార్మా కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. మొత్తంగా ఫార్మా సిటీలోకి 840 కోట్ల డాలర్ల (రూ.63,000 కోట్లు) పెట్టుబడులతో పాటు సుమారు 5.6 లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని అంచనా.
మరోవైపు దేశీయ ఫార్మా కంపెనీలు తమకు అవసరమైన ముడి పదార్ధాల్లో 70 శాతం ఇప్పటికీ చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నాయి. మన కంటే చైనా కంపెనీలు చౌకగా సరఫరా చేయడమే ఇందుకు కారణం. ఇలా చైనాపై అతిగా ఆధారపడడం ఏ మాత్రం మంచిది కాదని నిపుణులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. సరిహద్దు ఉద్రిక్తతలు ముదిరితే చైనా.. దీన్ని ఒక ఆయు?ధంగా మలుచుకునే ప్రమాదం ఉందని కేంద్ర ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే మోదీ సర్కార్.. ఇప్పటికే ఏపీఐల ఉత్పత్తికీ పీఎల్ఐ పథకాన్ని విస్తరించింది.
2020లో కొవిడ్ చైనాను చుట్టుముట్టినప్పుడు అక్కడి నుంచి బల్క్ డ్రగ్స్ ఉత్పత్తి, సరఫరా నెలల తరబడి నిలిచి పోయింది. దీన్ని ఆపరాగా చేసుకుని చైనా కంపెనీలు కీలక బల్క్ డ్రగ్స్ ధరలు 100 శాతం పెంచేశాయి. దాంతో దేశీయ మార్కెట్లోనూ కొన్ని కీలక ఔషధాల ధరలు పెరిగాయి. కొన్ని దేశీయ కంపెనీల ఔషధ ఎగుమతులకూ బ్రేక్ పడిరది. దీంతో బల్క్ డ్రగ్స్ కోసం ప్రత్యా మ్నాయాలు చూసుకోవాలని అమెరికా, యూరప్ దేశాల నుంచి దేశీయ ఫార్మా కంపెనీలపై ఒత్తిడి పెరిగింది. ఇవన్నీ హైదరాబాద్ ఫార్మా సిటీకి కలిసి రానున్నాయి.






