KCR: సభా సమరానికి సై.. అసెంబ్లీకి వస్తున్న కేసీఆర్…!
సీఎం రేవంత్ రెడ్డి దమ్ముంటే రావాలని.. సమస్యలపై చర్చిద్దామని సవాల్ విసురుతుండడంతో.. దీనికి సానుకూలంగా స్పందించారు మాజీ సీఎం కేసీఆర్. ఈనెల 29 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించినట్లు సమాచారం.అధికార పక్షం ఎలాంటి ఎజెండాను ఖరారు చేస్తుందో చూసి ముందుకు వెళదామని పేర్కొన్నట్లు తెలుస్తోంది.
శుక్రవారం సాయంత్రం ఎర్రవల్లిలోని ఫాంహౌస్లో నేతలతో సమావేశమైన కేసీఆర్… అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ పరంగా అనుసరించే వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు అంశంపై అటు అసెంబ్లీ సమావేశాల్లో, ఆ తర్వాత క్షేత్రస్థాయిలో బలంగా పోరాటం చేద్దామని స్పష్టం చేసినట్లు సమాచారం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి కారణంగా తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది.
అసెంబ్లీ సమావేశాల తర్వాత మహబూబ్నగర్ సమీపంలోని మండల కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాలు 15 రోజులుండేలా అధికారపక్షాన్ని డిమాండ్ చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ‘కాంగ్రెస్ పార్టీ నాటి నుంచి నేటి వరకు తెలంగాణకు ఎప్పుడూ ద్రోహమే చేస్తోంది. తెలంగాణ కోసం పుట్టిన బీఆర్ఎస్ కు తప్ప.. మరే ఇతర పార్టీకి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో పట్టింపు ఉండదు. నీళ్ల ప్రయోజనాల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగడదాం. ప్రజల్లోకి వెళ్లి ఉద్యమాలు నిర్మిద్దాం. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అసెంబ్లీ వేదికగా వివరిద్దాం. నీటి హక్కుల్ని పరిరక్షించుకుందాం. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై భారాస నుంచి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చేందుకు పట్టుపడదాం. అధికారపక్షం ఎలా స్పందిస్తుందో చూద్దాం.. దానికనుగుణంగా ముందుకు వెళదాం.
రైతు సమస్యలపై పోరాటం
రైతాంగ సమస్యలపై అసెంబ్లీలో బలంగా పోరాడాలి. ఫార్మాసిటీ, ‘హిల్’్ట పాలసీపై సమగ్ర చర్చకు గట్టిగా పట్టుపట్టాలి. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రావడం లేదు. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీటన్నింటిపై అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ను నిలదీయాలి.
బహిరంగ సభకు సన్నద్ధం కావాలి
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు అంశంపై నిర్వహించే భారీ బహిరంగ సభకు ఇప్పట్నుంచే సన్నద్ధం కావాలి. వాల్పోస్టర్లు, కరపత్రాలను సిద్ధం చేయాలి. లోకల్ హాల్ మీటింగ్లు, కార్యకర్తలతో సమావేశాలను నిర్వహించాలి’’ అని పార్టీ నేతలకు కేసీఆర్ సూచించినట్లు తెలిసింది. నల్గొండ జిల్లాలో మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలతో పాటు వికారాబాద్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల నుంచి భారీగా జనసమీకరణపై సమావేశంలో చర్చించినట్లు సమాచారం.






